Indiramma Indlu | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తేతెలంగాణ): పనిభారంతోపాటు సమస్యలపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు భగ్గుమంటున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిరసనకు ఉపక్రమించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు దూరంగా ఉన్నారు. టీపీఎస్ఎఫ్(తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్), టీపీఎస్సీఎఫ్(తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సోమవారం ఉదయం జూమ్ మీటింగ్లో నిర్ణయించిన మేరకు కలెక్టర్లు, డీపీవోలు, ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేశారు.
ప్రతిరోజూ ఉదయం తొమ్మిదిగంటల వరకు గ్రామాలకు చేరుకొని రెండు రోడ్లు, రెండు డ్రైనేజీలను సందర్శించి ఫొ టోలు అప్లోడ్ చేయడం, మరో రెండు నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలకు వెళ్లాల్సి ఉంటుందని కార్యదర్శులు చెప్తున్నారు. మొన్నటివరకు కులగణన సర్వేలో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించామని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల సర్వే, యాప్ అప్లోడ్ బాధ్యతలు అప్పగించడంతో ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమై నా.. ఎన్నికల ముందు తమకిచ్చిన హా మీల అమలుపై దృష్టిపెట్టడం లేదని ఆరోపిస్తున్నారు.