‘గద్దువాల దోసినాడు- గాలి గోపురం కట్టినాడు ముచ్చింతల దోసినాడు- మూల బురుజు కట్టినాడు పెబ్బేరును దోచినాడు- పెద్ద బురుజులను వేసినాడు కానాయపల్లీ గుట్టల నడుమ- చెరువులింగ వేయవాలే కానాయపల్లె గుట్టల నడుమ- దుర్బినైతే వేసినాడు ముగ్గువోసే మియాసాబు- బునాదింక తీయమనే’
సంస్థానాల సమూహంగా పేరుపొందిన పాలమూరు ప్రజలు వ్యవసాయ పనుల్లో, బండ్లు కొట్టేటప్పుడు, పీర్ల పండుగలో అలాయి తిరిగేటప్పుడు, కోలాటం వేసేటప్పుడు, స్త్రీలు బొడ్డెమ్మ సమయాల్లో ఇలా పాడుకుంటూ పరవశిస్తారు. సంస్థానాలకు గజదొంగగా, జానపదులకు మంచిదొంగగా కీర్తించబడిన పానుగంటి మియాసావు తాను దోచిన డబ్బుతో ప్రజాహిత కార్యక్రమాలు చేసి, కర్షకుల కష్టాలను విస్మరించకుండా కొత్తకోట, పాలెం, కానాయపల్లి గ్రామాల్లో చెరువులను కట్టించాడు. అంతేకాదు దేవాలయాలను, మూల బురుజులను నిర్మించాడు. శ్రీరంగాపురం దేవాలయానికి గాలిగోపురంతో పాటు శంకర సముద్రాన్ని నిర్మించినట్టుగా తెలుస్తున్నది.
1184లో కాకతీయ సామంతరాజైన మల్యాల గండదండాధీశుడు కట్టించిన గణప సముద్రం నేటికీ దాదాపు 5 వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నది. గణప సముద్రాన్ని ప్రేరణగా తీసుకొని వనపర్తి రాజులు కట్టించిన సప్త సముద్రాలు నేటికీ దాదాపు 20 వేల ఎకరాలకు పైగా సాగు నీటినందిస్తున్నాయి. పాలించే రాజులైనా, ప్రజాహితం కోరే మంచి దొంగలైనా సేవా దృక్పథంతో ప్రజా ప్రయోజనాల కోసం పనులు చేసి కీర్తించబడుతున్నారు. కానీ, ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రయోజనాలను విస్మరించి, ఈ ప్రాంత భవిష్యత్తును తాకట్టు పెడుతున్నది. ఈ ప్రాంత రైతాంగానికి మరణశాసనం లిఖిస్తున్నది.
పాలమూరు జిల్లాలోని ప్రతి గ్రామానికి చెరువే ఆదెరువు. చెరువు లేని ఊరు పాలమూరులో లేనే లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు వెయ్యికిపైగా చెరువులు, 5 వేలకు పైగా కుంటలున్నాయి. వాటిలో చాలా చెరువులు సముద్రాల పేరుతోనే మనుగడలో ఉన్నాయి. 500 ఎకరాలకుపైగా సాగు నీరందించే చెరువులు 100 దాకా ఉన్నాయి. నేటికీ చెరువు నిండితే ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మైసమ్మ, పోచమ్మ దేవతల పండుగలతో ఆ గ్రామం సంబురాలు చేసుకుంటుంది. ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు కాబట్టే వనపర్తి రాజులు ఇంజినీర్లను విదేశాలకు పంపి, అక్కడి టెక్నాలజీని పరిశీలించి, అధ్యయనం చేయించి, ఇక్కడ సరళాసాగర్ వంటి సైఫన్ సిస్టంతో కూడిన డ్యాంలను నిర్మించారు. ఏ ప్రాజెక్టయితే రాష్ర్టాల పునర్విభజనకు ముందు నిర్మాణంలో ఉన్న లేదా ప్రణాళికను పూర్తిచేసుకొని నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని ఆపకూడదు.
ఆ ప్రాజెక్టుల వల్ల లాభం పొందే ప్రజల హక్కులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని రాష్ర్టాల పునర్విభజన చట్టం స్పష్టంగా చెప్పింది. ఒక ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను లేకుండా చేస్తే గోదావరి, కృష్ణా జలాలపై చేపట్టే ప్రాజెక్టుల వల్ల ఆంధ్రా ప్రాంతానికి లాభం చేకూరుతుందని 372 పేరాలో ఫజల్ అలీ కమిషన్ అభిప్రాయం వ్యక్తపరిచింది.
నిజానికి బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిగేనాటికి పూర్వమే నాటి నిజాం ప్రభుత్వ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం పలు ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర ప్రాజెక్టు ఎడమ కాలువ, భీమా ప్రాజెక్టుల మొత్తం 174లు టీఎంసీలు. వీటితో పాటుగా జూరాల ప్రాజెక్టు, తదనంతరం శ్రీశైలం ప్రాజెక్టును ప్రతిపాదించిన ప్రాంతం, సామర్థ్యంతో కాకుండా కేవలం దిగువ ప్రాంతాలకు లాభం చేకూర్చేవిధంగా ఏపీ ప్రభుత్వం పనులను చేపట్టడంతో అటు ఎగువ ప్రాంతానికి సాగునీరు రాక ఉమ్మడి పాలమూరు జిల్లా దాదాపు 60 ఏండ్లు కన్నీటి గోసను అనుభవించింది. నాటి నిజాం ప్రభుత్వం ప్రతిపాదించినట్టు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టులను సాధించుకొని పనులను పూర్తిచేసినట్టయితే ఈ రోజు ఒక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానే దాదాపు 200 టీఎంసీల నీటిని సమర్థవంతంగా వాడుకునే పరిస్థితి ఉండేది. ఈ దిశగా నీటిపై హక్కులను సాధించేక్రమంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తగిన కృషి చేయలేదన్నది ముమ్మాటికీ నిజం అనటానికి ఉదాహరణలున్నాయి. 1956లో ఏపీ రాష్ట్రం ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. హైదరాబాద్ రాష్ట్రంగా ఉండి ఉంటే అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరందేది. ఏపీ ఏర్పాటు వల్ల ఈ అవకాశం పూర్తిగా పోగొట్టుకున్న జిల్లా పాలమూరు. జిల్లా మొత్తం విస్తీర్ణం 43 లక్షల ఎకరాలైతే అందులో వ్యవసాయానికి యోగ్యమైనది 35 లక్షల ఎకరాలు. ఒక 5 లక్షల ఎకరాలు బోర్ల కింద తీసుకున్నా, నికరంగా ఒక్క పాలమూరు జిల్లాకే 300 టీఎంసీల నీళ్లు అవసరం.
నాటి మద్రాస్, హైదరాబాద్ రాష్ర్టాల మధ్య తుంగభద్ర నీటి వినియోగంపై ఒప్పందాలు జరిగాయి. ఆ మేరకు తుంగభద్ర నీటిని నాటి రెండు రాష్ర్టాలు సమానంగా పంచుకోవాలి. అంటే కుడివైపు ఉన్న కేసీ కాలువకు 65 టీఎంసీలు, ఎడమ వైపున్న హైదరాబాద్ రాష్ర్టానికి ప్రయోజనం చేకూరేవిధంగా రాజోలిబండ డైవర్షన్ స్కీం కాలువను తవ్వి మరో 65 టీఎంసీలను వాడుకొని రెండువైపులా చెరో లక్ష ఎకరాలను సాగులోకి తీసుకురావాలని ఒప్పందాన్ని రాసుకున్నాయి.
1944లో ఈ ఒప్పందం ఆధారంగానే తుంగభద్ర జలాల పంపకాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకొని తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణం, రాజోలిబండ డైవర్షన్ స్కీం, భద్ర రిజర్వాయర్ నిర్మాణం, తుంగభద్ర ఆనకట్టల నిర్మాణాన్ని పూర్తిచేయటం జరిగింది. ఆ తర్వాత బచావత్ ట్రిబ్యునల్ ఎదుట నాటి ఏపీ ప్రభుత్వం ఒప్పందాలన్నీ పక్కకుపెట్టి కేసీ కాలువకు 39.90 టీఎంసీలు, రాజోలిబండ డైవర్షన్ స్కీంకు 17.70 టీఎంసీలు కావాలని కోరింది. దీని ఫలితంగానే రాజోలిబండ డైవర్షన్ స్కీంకు కర్ణాటక వాటా 1.2 టీఎంసీలు పోను 15.90 టీఎంసీలు మాత్రమే దక్కాయి. ఇది వలస పాలకుల వివక్షకు ఒక ఉదాహరణ. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కనీసం 15.90 టీఎంసీలు అయినా వస్తున్నాయా? అంటే అదీ లేదు. గత 30 ఏండ్ల నీటి పరిమాణాన్ని పరిశీలించినట్టయితే కేవలం 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే వస్తున్నట్టు గణాంకాల ద్వారా తేలింది. దీనికి విరుగుడుగా తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవలసి వచ్చింది. ఆర్డీఎస్కు కృష్ణా ట్రిబ్యునల్ అనుమతించిన 15.90 టీఎంసీల నీటిని సంపూర్ణంగా వినియోగించటానికే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మించింది. ఇక్కడ ఏటా దాదాపు 50 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రాంతం కోల్పోవలసి వచ్చింది.
నాటి నిజాం ప్రభుత్వం 1930లోనే భీమా రిజర్వాయర్ ప్రాజెక్టు, అప్పర్ కృష్ణా ప్రాజెక్టులకు సర్వే పనులను ప్రారంభించింది. ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్టులను 1932లో కేంద్రం ముందుంచింది. భీమా రిజర్వాయర్ ద్వారా 80 టీఎంసీల నీటిని వాడుకొని 4.2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం లక్ష్యం. ఇందులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి దాదాపు 3 లక్షల ఎకరాలు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల నీటి వినియోగంతో నేటి రాయచూరు జిల్లాలోని కమలదిన్నె అనే గ్రామం దగ్గర రిజర్వాయర్‌ను కట్టి, రెండు కాలువలను ప్రతిపాదించింది. కుడి కాలువ ద్వారా 3.22 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 3.3 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం. ఇందులో ఎడమ కాలువ కింద గద్వాల్, ఆలంపూర్ ప్రతిపాదించబడినాయి.
రాష్ర్టాల పునర్విభజన వల్ల పాలమూరు జిల్లా దాదాపు 7 లక్షల ఎకరాల సాగునీటితో పాటు 200 టీఎంసీల నికరజలాలను కోల్పోయింది. దీనికి కారణం నాటి ఏపీ ప్రభుత్వం. నీటిపై హక్కులను సాధించే క్రమంలో తగిన కృషి చేయలేదన్నది ముమ్మాటికీ నిజం. జూరాల ఇరిగేషన్ పథకంలో భాగంగా జూరాల రిజర్వాయర్‌ను 50 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని సర్వేలు పూర్తిచేశారు. కానీ, నాటి మైసూర్, నేటి కర్ణాటకలో ముంపు ఎక్కువగా ఉంటుందంటూ కేవలం 33 టీఎంసీల సామర్థ్యంతో జారాలను ప్రతిపాదించారు. కానీ, రాష్ర్టాల పునర్విభజన తర్వాత ఇది 11 టీఎంసీలకు తగ్గించి ఈ రోజు 6 నుంచి 7 టీఎంసీలకు పరిమితం చేశారు. ఇది ముమ్మాటికీ దిగువ ఉన్న ఆంధ్ర ప్రాంతాలకు మేలు చేయటం కోసమే అని చెప్పాలి. ఈ రోజు భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రధాన కాలువ నాటి భీమా రిజర్వాయర్ కింద ప్రతిపాదించిన ఎడమ కాలువ, భీమా రిజర్వాయర్ ప్రాంతం కర్ణాటక ప్రాంతానికి వెళ్లటం వల్ల మనం జూరాల నుంచి లిఫ్ట్ చేసుకుంటున్నాం.
సిద్ధేశ్వరం దగ్గర కట్టాల్సిన శ్రీశైలం ప్రాజెక్టును శ్రీశైలంకు మార్చి తెలంగాణకు ద్రోహం చేశారు. సిద్ధేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే ఈరోజు పాలమూరులో కొంతభాగం నల్గొండలో చాలా ప్రాంతాల్లో గ్రావిటీ ద్వారా సాగునీరు వచ్చేది. తెలంగాణకు సాగునీరు దక్కవద్దని చేసిన కుటిల రాజకీయం మరొకటి శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ నీటి అవసరాలకు దూరం చేయడం. ప్రాజెక్టును హైడ్రో ఎలక్ట్రిసిటీ పేరుతో కనీస నీటి అవసరాలు కూడా వాడుకోకుండా చేసింది. పాలమూరు ప్రాజెక్టులకు వరద జలాల పేరుతో, అటవీ అనుమతుల పేరుతో కోర్టు కేసుల పాలుచేసి రాయలసీమకు చెందిన ప్రాజెక్టులను హైదరాబాద్‌లోని ఆస్తులమ్మి కట్టుకున్నది నిజం కాదా?
రాయలసీమ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులను కృష్ణా ట్రిబ్యునల్ ముందు సరైన రీతిలో ఉంచలేదనే వాదనలూ ఉన్నాయి. కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ఎత్తు పెంచుతుండటం అనే వాదనా ఉన్నది. ఒకవేళ ఆల్మట్టి ఎత్తు పెంచితే, పెంచే ఎత్తు ద్వారా నిల్వ అయ్యే నీటిలో సగభాగం పాలమూరుకు ఇవ్వాలి. గతంలో ఆల్మట్టి ఎత్తు పెంపు మీద చర్చ జరుగుతున్న సమయంలో 50 టీఎంసీలు పాలమూరుకు ఇవ్వాలనే వాదన జరిగింది. విచిత్రంగా ఏపీ ప్రభుత్వమే దానికి ఒప్పుకోలేదు.
కృష్ణానది పరీవాహక ప్రాంతం నుంచి మరొక బేసిన్‌కు నీటిని తరలించే ఏ ప్రాజెక్టుకు కృష్ణా నీటి కేటాయింపులు లేకుండా ట్రిబ్యునల్ ముందు వాదించాలి. నికరజలాలు కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలి. గోదావరి నీటిని పోలవరం ద్వారా కృష్ణానది ప్రాజెక్టుకు తరలిస్తున్నారు కాబట్టి నీటి కేటాయింపులు జూరాల నుంచి పులిచింతల పైభాగం వరకే మొత్తం నీటిని పంచాలి. ఈ బేసిన్ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వేరే బేసిన్‌కు నీరు ఇవ్వాలి. జూరాల నుంచి పులిచింతల పైభాగాన్ని మొదటి ప్రాధాన్యంగా పెన్నా బేసిన్‌కు తరలించే నీటి అంశాన్ని రెండవ ప్రాధాన్యాంశంగా నీటి కేటాయింపులు చేసి ట్రిబ్యునల్ ముందుంచాలి. కేడబ్ల్యూడీటీ-1 కృష్ణా డెల్టాకు 180 టీఎంసీలను కేటాయించింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిధులతో నిర్మిస్తున్నారు. కాబట్టి పోలవరం డైవర్షన్ కింద కృష్ణా డెల్టా కవర్ అవుతుంది. అందువల్ల కేడబ్ల్యూడీటీ-1 గంపగుత్తగా ఇచ్చిన 800 టీఎంసీలలో కృష్ణా డెల్టా కోసం ఇచ్చిన 180 టీఎంసీలను ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు కేటాయించాలి.
ముఖ్యంగా పంతాలకు పోకుండా ఒక అఖిలపక్షం ఏర్పాటుచేసి అందరినీ భాగస్వాములను చేయాలి. నీటి కేటాయింపులుంటేనే కేంద్రం నిధులు ఇస్తుంది. పాలమూరుకు 150 టీఎంసీలు, డిండికి 40 టీఎంసీలు, కల్వకుర్తికి 60 టీఎంసీలు కేటాయించాలి. పాలమూరుకు జాతీయహోదా తీసుకురావాలి. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌కు 90 శాతం అప్రూవల్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. దానిని చంద్రబాబు ప్రోద్బలంతో తిరిగి వెనక్కిపంపించారు. గతంలో కేంద్రం సహకరించకున్నా ప్రతీ ఆఫీసు చుట్టూ తిరిగి డీపీఆర్‌ను 90 శాతం పూర్తిచేశాం. కేవలం నీటి కేటాయింపు అంశం తేలకపోవడం వల్లనే ప్రాజెక్టును 90 శాతం వరకు చేయగలిగాం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నీటి కేటాయింపు ఉన్న ఏకైక ప్రాజెక్ట్ భీమా లిఫ్ట్. అందుకే, కేంద్రం దాదాపు రూ.800 కోట్ల దాకా నిధులను ఏఐబీపీ పథకం కింద తెలంగాణకు ఇచ్చింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ నిర్వాకం వల్ల భీమా ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. రాజీవ్ భీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీల కృష్ణా నికర జలాల కేటాయింపు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. 2.03 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా భీమా ప్రాజెక్టు అప్పటికే ప్రారంమైంది. ఇప్పుడు ఒక టీఎంసీకి 10 వేల ఎకరాలకు నీరందించే విధంగా భీమా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. కానీ భీమా ప్రాజెక్టుకు కేటాయించిన 20 టీఎంసీల నీటిలో 5 టీఎంసీల నీటిని రేవంత్ తన సొంత నియోజకవర్గానికి మళ్లించడం భీమా ప్రాజెక్టు కింద ఉండే రైతుల జీవితాలను నాశనం చేయడమే. ఇంకా ఉంది..