ఎన్నో ఆశలతో కార్పొరేట్ సంస్థల్లో చేరుతున్న యువతులకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతున్నది. అనేకచోట్ల ఉద్యోగాల్లో లింగ వివక్ష కనిపిస్తున్నది. సమాన అవకాశం, లింగ సమానత్వం అనేది.. అందని ద్రాక్షగానే మిగులుతున్నది. ఈ విషయాన్ని ‘లీన్ ఇన్-మెకిన్సే అండ్ కంపెనీ’ తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం బయటపెట్టింది. ఉమెన్స్ వర్క్‌ప్లేస్‌పై చేపట్టిన సర్వే.. ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించింది. పురుషులతో సమానమైన తెలివితేటలు, పట్టుదల, ధైర్యసాహసాలు, ఉద్యోగంలో రాణించాలన్న తపన ఉన్నప్పటికీ.. ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతూనే ఉన్నదని తేల్చింది.
ప్రతీ సంస్థలోనూ పురుషులతో సమానంగా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి మహిళలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయినప్పటికీ.. ప్రమోషన్లు, ఇతర నాయకత్వ బాధ్యతలను అప్పగించడానికి సంస్థలు ఆసక్తి చూపడంలేదట. మహిళల కెరీర్ పురోగతి, స్పాన్సర్షిప్ లాంటివి అందించడానికీ వెనకాడుతున్నాయట. అందులోనూ కెరీర్ ప్రారంభంలో ఉన్న యువతపై మరింత నిర్లక్ష్యం చూపుతున్నాయని సర్వేలో తేలింది. ముఖ్యంగా 30 ఏళ్లలోపు యువతులను ప్రమోషన్లు, కీలక బాధ్యతల కోసం నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. సర్వే వివరాల ప్రకారం.. ఎంట్రీ లెవల్ మేనేజర్లలో మూడింట ఒక వంతు మంది మాత్రమే మహిళలు ఉన్నారు. కొత్తగా కెరీర్‌ను ప్రారంభించిన మహిళల్లో కేవలం 31% మందికి మాత్రమే స్పాన్సర్షిప్ అందిస్తున్నారు.
అదే దశలో పురుషులలో 45% మందికి స్పాన్సర్స్ ఉన్నారు. ఇలా కెరీర్ ప్రారంభంలోనే అవకాశాలను కోల్పోవడం.. మహిళల ఉద్యోగ కెరీర్‌పై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంట్రీ లెవల్ ఉద్యోగుల్లో రిమోట్ వర్క్ కోసం మహిళలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఉపయోగం కంటే.. నష్టమే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇలా రిమోట్ వర్క్ చేసేవారికి ప్రమోషన్ రేట్లు తగ్గుతాయని చెబుతున్నారు.
అదే సమయంలో, పురుషుల ప్రమోషన్ రేట్లు మాత్రం స్థిరంగా ఉంటున్నాయట. వివక్షతోపాటు ఈ నివేదిక మరో ఆధునిక ముప్పును కూడా హైలైట్ చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఏఐ సాధనాలను నేర్చుకోవడానికి, ఉపయోగించడానికి.. మహిళలకు కనీస మద్దతు లభించడం లేదట. ఈ కీలకమైన రంగంలో మహిళలపై వివక్ష కారణంగా.. వారు మరింత వెనుకబడిపోయే ప్రమాదం ఉన్నది. ఏఐతోపాటు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకుంటే.. వారి కెరీర్ దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ, కార్పొరేట్ సంస్థలు చూపుతున్న అసమానత వల్ల.. ఆడవాళ్ల ఆశలు, ఆశయాలు అడియాసలే అవుతున్నాయి.