ప్రపంచంలోనే అత్యధికమంది బియ్యాన్నే ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయితే, ఎక్కువగా తెల్లని పాలిష్ చేసిన బియ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు ఆరోగ్యానికి మంచిదని దంపుడు బియ్యాన్ని వండుకుంటారు. ఈ క్రమంలో.. ఏరకమైన బియ్యంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో నిపుణులు వివరిస్తున్నారు.
పాలిష్ చేసిన బియ్యంలో విటమిన్ బి1 (థయామిన్) ఉండదు. దాంతో నాడీ వ్యవస్థ, గుండె పనితీరుపై ప్రభావం చూపే ‘బెరిబెరి’ వ్యాధి ముప్పు ఉంటుందట. పాలిష్ బియ్యంతో కార్బొహైడ్రేట్స్ అధికంగా అందుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. ఇక వీటిలో ఫైబర్ చాలా తక్కువ. ఈ బియ్యంతో వండిన అన్నం ఎంతతిన్నా.. కడుపు నిండినట్లుగా అనిపించదు. మళ్లీమళ్లీ ఆకలి అవుతుంటుంది. ఫలితంగా, బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఫైబర్ లోపంవల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి జీర్ణ సమస్యలూ వస్తాయి. పోషకాలు తక్కువగా ఉండటం వల్ల కీళ్లకు సరైన పోషణ అందించవు.
దంపుడు బియ్యానికి ఉండే తవుడు పొరలో.. విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభిస్తాయి. వీటిని రెగ్యులర్గా తీసుకుంటే మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గుతుంది. సోడియం తక్కువగా ఉండటం వల్ల.. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇక ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలకపాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3.. దంపుడు బియ్యంలో పుష్కలంగా లభిస్తాయి.
ఇందులో అధిక మొత్తంలో లభించే క్యాల్షియం, మెగ్నీషియం.. ఎముకల ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. దంపుడు బియ్యం నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల వెంట వెంటనే ఆకలి వేయదు. బరువు తగ్గాలని అనుకునేవారికి మంచిది. ఇందులోని ఫైబర్.. జీవక్రియలు సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేయడంలోనూ ముందుంటుంది. దంపుడు బియ్యంలోని పోషకాలు.. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.