Terrorists : జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో మరోసారి అలజడి సృష్టించడం కోసం పాకిస్థాన్ (Pakistan) భారీ కుట్రకు తెరలేపింది. సుమారు 800 మంది ఉగ్రవాదుల (Terrorists) ను భారత్లోకి పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ సైన్యం కలిసి ఈ ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు ఇవాళ (బుధవారం) హెచ్చరించాయి. ఉగ్రవాదులను చొప్పించడం కోసం పాకిస్థాన్.. నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సుమారు 70 ఉగ్రవాద లాంచ్ప్యాడ్లను పునరుద్ధరించినట్లు వెల్లడించాయి.
ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి మధ్యప్రాచ్య సంక్షోభంపై కేంద్రీకృతమై ఉంది. అదే సమయంలో భారత్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే అదునుగా భావించి పాకిస్థాన్ ఈ కుట్రకు పాల్పడుతోందని నిఘా విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని లాంచ్ప్యాడ్లకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను తరలించి చొరబాటుకు సిద్ధంగా ఉంచారని సమాచారం ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇటీవలి కాలంలో భారత భద్రతా బలగాల అప్రమత్తతతో పలు చొరబాటు యత్నాలు విఫలమయ్యాయి. దాంతో పాకిస్థాన్ తన వ్యూహాన్ని మార్చుకుంది.
ఇప్పుడు ఒకేసారి పలు ప్రాంతాల నుంచి 10 నుంచి 15 మంది చొప్పున గ్రూపులుగా ఉగ్రవాదులను పంపి భద్రతా బలగాల దృష్టిని మరల్చాలని పాకిస్థాన్ చూస్తోంది. ఇలాచేస్తే కొందరైనా భారత్లోకి చొరబడగలరని పాకిస్థాన్ భావిస్తోంది. గత ఏడాది భారత బలగాలు నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఉగ్రవాద మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాక్పై ఒత్తిడి పెరిగింది. దాంతో కశ్మీర్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల నుంచి ఐఎస్ఐపై ఒత్తిడి వస్తోంది. స్థానిక నెట్వర్క్లు బలహీనపడటంతో, సరిహద్దుల నుంచి శిక్షణ పొందిన, యుద్ధ నైపుణ్యం ఉన్న ఉగ్రవాదులను పంపి భారీ దాడులకు పాల్పడాలని ఐఎస్ఐ యోచిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.