హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ‘గత ప్రభుత్వం కోట్ల విలువ చేసే భూమిని నాకు ఉచితంగా అందిస్తే, దాన్ని కొందరు కబ్జాదారులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నరు.. ఇప్పటికే గోడలు, కట్టుకున్న ఇంటిని కూడా కూలగొట్టిండ్రు.. కోర్టు కేసులు వేసి వేధిస్తున్నరు.. మాకు గత ప్రభుత్వం ఇచ్చిన ఆ స్థలాన్ని కాపాడుండ్రి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ దర్శనం మొగులయ్య (Darshanam Mogilaiah) మొరపెట్టుకున్నారు. ఆయన ఆవేదన విన్న కేటీఆర్, అన్ని విధాలుగా సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. మొగులయ్య తన బాధలు చెప్పుకొనేందుకు కేటీఆర్‌ను శనివారం తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీయగా తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో పూర్తి చికిత్స చేయించే బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం తనకు హయత్‌నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొందరు వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కోర్టు కేసుల వివరాలను చెప్పారు. గత ప్రభుత్వంలో కోట్ల విలువ చేసే భూమిని తనకు ఉచితంగా అందిస్తే, దాన్ని కొందరు కబ్జాదారులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధపడ్డారు. ఇప్పటికే గోడలను, కట్టుకున్న ఇంటిని కూడా కూలగొట్టారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అనేకసార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లినా పరిషారం లభించలేదని, ఈ విషయంలో తనకు అండగా నిలవాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
స్పందించిన కేటీఆర్.. కలెక్టర్‌కు ఫోన్ మొగులయ్య ఆవేదనపై తక్షణమే కేటీఆర్ స్పందించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్యకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సమస్యను వెంటనే పరిషరించి మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు. మొగులయ్య ఇంటిని కూడా కొందరు కూల్చివేశారని వివరించారు. కబ్జాకు గురవుతున్న వారి భూమికి, వారి కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. అవసరమైతే మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపర కేసులను ఎదురొనేందుకు కూడా సాయం అందిస్తామని హామీ కేటీఆర్ ఇచ్చారు.
‘ఒకప్పుడు లింగాల అడవుల్లో 12 మెట్ల కిన్నెర వాయించుకునే నాకు అప్పటి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చూపిన ప్రేమ వల్లే ఈ గుర్తింపు దకిందని చెప్పారు. కేసీఆర్ తనను గుర్తించి ఉగాది పురసారం ఇచ్చి గౌరవించడం వల్లే తన కళ ఈ ప్రపంచం దృష్టికి చేరిందని గుర్తుచేశారు. పద్మశ్రీ అవార్డు కూడా దకిందని పేర్కొన్నారు. కేసీఆర్ తన కుటుంబానికి చేసిన సాయానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. సబ్బండ వర్ణాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం మూటలు పంపడం, వాటాల పంపకంలో మునిగితేలుతున్నారని శనివారం ఎక్స్ వేదికగా విసుర్లు విసిరారు. ఓ పత్రికలో ప్రచురితమైన కథనాలను ట్యాగ్ చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ‘అన్నదాతకు రైతు బంధు రాలే..రుణమాఫీ కాలే.. రూ.500 బోనస్ బోగస్ అయింది. ధాన్యం కొనుగోళ్లకు దిక్కులేదు’ అంటూ తూర్పారబట్టారు. ‘రాష్ట్రంలో రైతులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ దొంగలేమో నీకెంత?..నాకెంత? అని వాటాల పంచాయితీల్లో కొట్టుకుచస్తున్నారు’అంటూ విమర్శనాస్ర్తాలు సంధించారు.