హైదరాబాద్, అక్టోబర్18(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామని, అభివృద్ధిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మథనపడుతున్నారు. 22 నెలలు అవుతున్నా ప్రభుత్వ పరంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను అధికారులు చేరుకోలేకపోయారని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. శనివారం ముఖ్యమంత్రి నివాసంలో అత్యున్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో రేవంత్‌రెడ్డి ఈ విషయంలో బయటపడిపోయారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో నెపాన్ని అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఉన్నత చదువులు చదువుకొని, ప్రజలకు సేవ చేయాలనే మీరంతా ఇంతదూరం వచ్చారని, తాను కూడా ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనంత స్వేచ్ఛ ఇచ్చానని, అయినప్పటికీ నిర్దేశించుకున్న గమ్యాలను చేరుకోలేకపోయారంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వపథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయడంలో, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో అధికారుల్లో చురుకుతనం కొరవడిందని నిర్వేదం వ్యక్తంచేసినట్టు సమాచారం. అధికారులు కష్టపడి ఒళ్లు వంచి పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని, లేదంటే ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని అధికారులతో అన్నట్టు తెలిసింది.
అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు!
కొందరు అధికారులు ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించినట్టు సమాచారం. కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని హెచ్చరించినట్టు తెలిసింది. గాడితప్పిన పాలనకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కటువుగా చెప్పినట్టు తెలిసింది.
వట్టి చేతులతో ఏం చేయగలం
ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మాన్ని అర్థం చేసుకున్న సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీ ఏంటో చెప్పకుండా తామెలా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రభుత్వంలోని మంత్రులు, మీ చుట్టూ తిరిగే సీనియర్ అధికారులు స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారని, వారి అభిప్రాయాలు తమ మీద బలవంతంగా రుద్దుతున్నారని, వాటిని సీఎం అభిప్రాయాలుగా భావించాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మీద అవినీతి ఆరోపణలు రావడం కూడా ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బ తీసిందని మరో సీనియర్ అధికారి అన్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో ఏయే శాఖకు ఎంత ప్రాధాన్యం ఇస్తుంది? ఆయా శాఖలకు ఎంత నిధులు ఖర్చు చేయాలి? ఎన్ని నిధులు రాబట్టాలనే విషయంలో శాఖాల వారీగా ప్రభుత్వపరమైన దిశా నిర్దేశం ఇప్పటి వరకు రాలేదని, సీఎంగా మీ ఆలోచన కోసం రెండేండ్లుగా ఎదురు చూస్తున్నామని కార్యదర్శి ఒకరు రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. శాఖల అభివృద్ధికి కేటాయించిన నిధులకు అర్థిక శాఖ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదని, తీసుకున్న నిర్ణయాలు అమలుకానప్పుడు వట్టి చేతులతో తాము మాత్రం ఏమి చేయగలమని సీనియర్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా తాము మాత్రం ఎంతకాలం పోరాడగలమని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేసినట్టు సమాచారం.
సీఎం వైఫల్యాలు అధికారులపైకి
కార్యదర్శుల వివరణతో షాక్ అయిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని, ఎకడ కూడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదని సీఎంవో అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సమాధానం దాటవేసిన సీఎం, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని కార్యదర్శులను ఆదేశించినట్టు తెలిసింది. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారని తెలిసింది. ఇకపై సీఎస్‌తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని అన్నట్టు సమాచారం. సమీక్ష సమావేశంలో సీఎం తన వైఫల్యాలను తమ మీదకు నెట్టే ప్రయత్నమే చేశారని సీనియర్ అధికారి ఒకరు నిస్సహాయత వ్యక్తంచేశారు.