హైదరాబాద్ మహానగరం చుట్టూ ప్రభుత్వ భూములు.. నిరుపేదల అసైన్డ్ భూములు.. ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాలు.. ఇవి చాలవన్నట్టు చివరికి దేవుడి మాన్యాలను కూడా బిగ్ బ్రదర్స్ వదలడం లేదు. అత్యంత విలువైన ఏరియాలో ఉన్న ఆలయ భూములపై కన్నేశారు. సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో ఈ భారీ భూస్కాం స్వయంగా మంత్రి సురేఖ కూతురు సుస్మిత నోటి నుంచే బయటపడింది.
తీరా.. ‘నమస్తే తెలంగాణ’ లోతుగా ఆరా తీయగా మంచిరేవుల పరిధిలోని వేణుగోపాలస్వామి గుడికి చెందిన 114 ఎకరాలను చెరబట్టేందుకు పది నెలలుగా బిగ్ బ్రదర్స్ పావులు కదుపుతున్నట్టు తెలిసింది. పక్కన ఉన్న ప్రైవేట్ విల్లాలకు వెళ్లాలంటే ఈ గుడి భూముల్లోంచే ‘మార్గం’ ఉండటంతో తొలి దశ వీటిని చేజిక్కించుకొని ఆపై దారి మెలిక పెట్టి మిగతా భూములనూ కాజేయాలని వేసిన స్కెచ్ వెలుగుచూసింది.
కానీ బిగ్ బ్రదర్స్ ఊహించని విధంగా సందట్లో సడేమియాలా ప్రైవేట్ భూముల్లోని ఓ కంపెనీకి చెందిన బిల్డర్ ఆలయ భూముల్లోంచి దారి కోసం కొండా దంపతులను ఆశ్రయించారు. తెర వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారడంతో భూమికి బదులు భూమి ప్రాతిపదికన రెండెకరాల భూమి ఇచ్చేందుకు శాఖాపరంగా సురేఖ ఓకే చేశారు. చకాచకా దస్త్రం సర్కారుకు చేరి జీవో రావడమే తరువాయి.. సమాచారం బ్రదర్స్‌కు చేరడంతో అప్రమత్తమై ‘ముఖ్య’నేతకు ఉప్పందించారు.
అంతే.. సచివాలయంలో ఉన్నతాధికారులు ఠక్కున ఆ దస్ర్తాన్ని కోల్డ్ స్టోరేజీలోకి పంపారు. ఇది జరిగి ఆరు నెలలు గడుస్తున్నది. తాజాగా సుస్మిత స్వయంగా ఈ భూబాగోతాన్ని బట్టబయలు చేశారు.
స్పెషల్ టాస్క్బ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బిగ్ బ్రదర్స్ ఆకలికి, అత్యాశకు అంతు లేకుండా పోతున్నది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ప్రభుత్వ భూములు, నిరుపేదల అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాలను కాజేసిన బిగ్ బ్రదర్స్ కన్ను ఇప్పుడు దేవుడి మాన్యాలపై పడింది. అత్యంత విలువైన ప్రాంతంలోని 114 ఎకరాల ఆలయ భూములపై బిగ్ బ్రదర్స్ కన్నేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేత వర్సెస్ మంత్రి కొండా సురేఖ వివాదంలో భాగంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత నోటి నుంచి ఈ ‘బిగ్’ డీల్ బయటికొచ్చింది. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ లోతుగా విచారించగా, రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామ పరిధిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 114 ఎకరాల భూ దందా వెలుగు చూసింది. వంద ఫీట్ల రోడ్డు కోసం రెండెకరాలతో మొదలైన ఈ కుంభకోణం.. ఏకంగా రూ.600 కోట్లకు చేరింది.
ఆరు నెలల కిందటే మూలకు పడిందనుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యనేత, మంత్రి, బిగ్ బ్రదర్స్, ఎండోమెంట్, రెవెన్యూ అధికారుల మధ్య దొంగాపోలీస్ ఆట మాదిరిగా సాగిన ఈ భూ దందా పూర్తి వివరాలు ఇవిగో. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలో వేణుగోపాలస్వామి ఆలయానికి భారీగా మాన్యం భూములు ఉన్నాయి. అనేక సర్వే నెంబర్లలో దాదాపు 144.07 ఎకరాలు ఉండగా, గతంలో గ్రేహౌండ్స్, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి సుమారు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం వినియోగించింది. దీంతో ప్రస్తుతం ఆలయానికి 114 ఎకరాల వరకు మిగిలి ఉంది. వీటిపై చాలాకాలంగా న్యాయ వివాదం కొనసాగుతున్నది. ఈ భూములు ‘సర్వీసు ఇనాం’గా తమకే చెందుతాయని ఆలయ అర్చకులు 20 ఏండ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూములు తమవేనంటూ దేవాదాయ శాఖ అధికారులు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భూములపై స్టేటస్ కో కొనసాగుతున్నది.
వంద ఫీట్ల రోడ్డు కోసం ఒప్పందం
ఈ భూములకు ఆనుకొని అనేక ప్రైవేట్ భూములున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్ రోడ్ నుంచి ఆ భూములకు దారి లేదు. వేణుగోపాలస్వామి ఆలయ భూముల్లో నుంచి వెళ్లాల్సిందే. ఏడాది కిందట ఒక ప్రైవేట్ కంపెనీ అక్కడ విల్లా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించి, తమకున్న భూమితో పాటు పక్కన ఉన్న ఇతరుల భూమికి కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నది. ఆలయ భూములను తమకు అప్పగించే పని కోసం బిగ్ బ్రదర్స్‌ను సంప్రదించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భూములపై ఉన్న స్టేటస్ కో ను తొలగించి, రోడ్డు కోసం దేవాదాయ భూమి ఇప్పిస్తామని బిగ్ బ్రదర్స్ హామీ ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది.
దేవుడి మాన్యంపైనే కన్నేసిన బ్రదర్స్
తమ వద్దకు వచ్చిన భూముల వ్యవహారంపై బిగ్ బ్రదర్స్ లోతుగా ఆరా తీశారట. రెండు ఎకరాల కోసం ప్రయత్నించడం కన్నా ఏకంగా 114 ఎకరాల దేవాలయ భూమిని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఆ భూమిపై హైకోర్టును ఆశ్రయించిన వారితో అనధికారికంగా ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దేవాదాయ శాఖను ఎలాగైనా ఒప్పించి, న్యాయ వివాదాలు పరిష్కరించి ఎన్వోసీ ఇప్పిస్తే ఆ భూములు తమ చేతికి వస్తాయని బ్రదర్స్ అనుకున్నారట. ఇతర ప్రైవేట్ భూముల వారు కూడా ఈ రోడ్డు నుంచే వెళ్లాల్సి వస్తుంది కాబట్టి, వారి నుంచి కూడా భారీగా వసూలు చేసుకోవచ్చని ప్లాన్ వేసినట్టు తెలుస్తున్నది.
బ్రదర్స్‌కు ‘లీక్’.. కొండాకు షాక్
రెండెకరాలు మార్పు చేసేలా ఫైల్ సిద్ధమైన విషయాన్ని రెవెన్యూ శాఖ వర్గాలు బిగ్ బ్రదర్స్‌కు లీక్ చేసినట్టు తెలిసింది. దీంతో వారు కంగుతిన్నారట. ఫైల్ పూర్తయితే 114 ఎకరాల ‘బిగ్’ డీల్ ఫెయిల్ అవుతుందని, భూమికి బదులుగా భూమి అనే ప్రాతిపదికన దేవాదాయ శాఖ ఎన్వోసీ ఇస్తే హైకోర్టులో సమస్య మరింత జఠిలం అవుతుందని ఆందోళన చెందినట్టు తెలిసింది. వెంటనే అప్రమత్తమై విషయాన్ని ‘ముఖ్యనేత’కు చేరవేశారని సమాచారం. ఆయన అప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారని, అయినా ఆగమేఘాల మీద స్పందించి ఫైల్‌ను పక్కన పడేయాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో కొండా దంపతులు షాక్ తిన్నట్టు సమాచారం. అప్పటినుంచీ ఈ ఫైల్ మూలకే ఉన్నదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఆరు నెలల కిందట జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలతో బయటికి వచ్చింది.
అనూహ్యంగా ‘కొండా’ ఎంట్రీ
ప్రైవేటు భూముల్లోకి వెళ్లాలంటే దేవాదాయ శాఖ భూములు మినహా వేరే మార్గం లేకపోతే అధికారికంగా ‘భూమికి బదులుగా భూమి’ ఇచ్చి సర్దుబాటు చేసుకునే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో బిగ్ బ్రదర్స్‌ను ఆశ్రయించిన బిల్డర్లకు ఈ విషయం తెలియడంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దంపతులను ఆశ్రయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వంద ఫీట్ల రోడ్డు కోసం సర్వే నెంబరు 294లోని రెండు ఎకరాల భూమి కావాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ప్రక్రియలో తెరవెనుక సైతం భారీగా ఒప్పందాలు జరిగాయని, భారీ మొత్తంలో చేతులు మారాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా శాఖాపరంగా ఫైల్ సిద్ధమై, ప్రభుత్వ ఉత్తర్వుల కోసం సచివాలయంలోని ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినట్టు తెలిసింది.
బ్రదర్స్ కబ్జా కోసం సీఎం ఫైల్ ఆపిండు
మంచిరేవుల విల్లాస్ కట్టుకునే ఏరియా. విల్లాస్ వాళ్లు వెళ్లాలంటే ఎండోమెంట్ ల్యాండ్ దాటి పోవాలి. దానిపక్కనే వాళ్ల కమర్షియల్ ల్యాండ్ ఉన్నది. దీంతో వాళ్లు కొండా సురేఖను సంప్రదించి మేము కమర్షియల్ ల్యాండ్ ఇస్తాం.. మాకు దేవాదాయశాఖ భూమి ఇవ్వండని కోరిండ్రు. అలా అయితే వాళ్లకు రోడ్డు వస్తదని చెప్పిండ్రు. ల్యాండ్‌కు ల్యాండ్ ఇస్తున్నారనే ఉద్దేశంతో కొండా సురేఖ సంతకం పెట్టిండ్రు. అసలు ఈ ఫైల్ సీఎం దాకా పోవాల్సిన అవసరం లేదు.. కానీ, జపాన్‌లో ఉన్న సీఎం ఈ ఫైల్‌ను ఆపించి తన దగ్గర పెట్టుకున్నరు. ఎందుకంటే ఆయన తమ్ముళ్లు ఆ భూమిని కబ్జా చేయాలి కదా! మంచిరేవుల అంటే సీఎం తమ్ముళ్ల అడ్డా.
-కొండా సుస్మిత పటేల్, మంత్రి సురేఖ కూతురు