భూత్పూర్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ( Purchase centers ) రైతులు ధాన్యం అమ్మాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ( MLA Madhusudhan Reddy ) కోరారు. సోమవారం పట్టణ కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మద్దతు ధర ఇస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు .
గ్రేడ్ ఏ రకానికి రూ. 2,320లు, గ్రేడ్ బి రకానికి రూ. 2, 300లు ఇచ్చి కొంటుందని తెలిపారు. వానాకాలంలో కొంతమంది రైతులు దళారులకు అమ్ముకొని తీవ్రంగా మోసపోయినట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికీ దళారులు రైతులకు డబ్బులు ఇవ్వలేదని తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు. ధాన్యంలో తాలు, మట్టి పెడ్డలు లేకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కదిరె అశోక్ రెడ్డి, తహసీల్దార్ జయలక్ష్మి, మున్సిపాలిటీ కమిషనర్ నూరు నజీబ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ కదిరె శేఖర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ గడ్డం రాములు, సీఈవో రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.