గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. రంగం ఏదైనా అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నది. రాష్ర్టానికే గుండెకాయ లాంటి హైదరాబాద్ అభివృద్ధికి స్వరాష్ట్ర పాలనలో అనేక అడుగులు పడ్డాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రూ.50 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పించడంతో పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఎన్నో అంతర్జాతీయ, జాతీయ సంస్థలు నగరంలో తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మొత్తంగా కరోనా లాంటి అవరోధాలను అధిగమిస్తూ విశ్వనగరంగా తమ ప్రయాణం సాగిస్తున్నది.
రూ.50 వేల కోట్లతో మౌలిక వసతుల కల్పన
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం 13,610 గృహాలు పూర్తికాక వాటిలో 15 లొకేషన్లలో 2510 ఇండ్లను ప్రారంభించారు. వాటిలో 1681 ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మరో 31,291 ఇండ్లు అభివృద్ది దశలో ఉన్నాయి.
గాంధీకి అరుదైన ఘనత..
కరోనా రెండో దశలో వేలాది మంది ప్రాణాలు కాపాడి దేశంలోనే ఉత్తమ కొవిడ్ సెంటర్‌గా పేరుగాంచిన గాంధీ 2021లో మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్(ఐఎన్టీఈఎన్టీఇంటెంట్)కు ఎంపికైంది. దక్షిణ భారత దేశం నుంచి మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ (ఎండీఆర్‌యూ) ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, వైద్యకళాశాలలు క్లినికల్ ట్రయల్ యూనిట్‌కు దరఖాస్తు చేసుకోగా వాటిలో గాంధీ దవాఖానకు అరుదైన అవకాశం దక్కింది.
హాట్‌కేకుల్లా.. ప్లాట్లు
రియల్ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్ తన సత్తా చూపింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐటీ కారిడార్‌లోని కోకాపేటలో నియోపోలీస్ లేఅవుట్‌ను అభివృద్ధి చేసి అమ్మకానికి పెట్టగా హాట్‌కేక్‌లుగా ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఆన్లైన్ వేలంలో మొత్తం 49 ఎకరాల విస్తీర్ణం గల 8 ప్లాట్లను విక్రయానికి ఉంచగా వీటిని కొనుగోలు చేసేందుకు సుమారు 60 మంది బిల్డర్లు పోటీ పడ్డారు. ఎకరం రూ.40.05 కోట్లు పలకడం గమనార్హం. మొత్తం ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా రూ. 2000.37 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ప్లాట్ల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి మరో రూ. 474.61 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 44 ప్లాట్లను ఆన్లైన్లో విక్రయానికి ఉంచగా, 39 ప్లాట్లు ఆన్లైన్ వేలంలో కొనుగోలు చేశారు. మొదటి రోజు 23 ప్లాట్లకు రూ.141.61 కోట్ల ఆదాయం రాగా, రెండవ రోజు 16 ప్లాట్లకు రూ.333,00,14,000 ఆదాయం వచ్చింది.
5 లక్షలకు పైగా సందర్శకులు..
34వ జాతీయ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన సాహిత్య సంద్రాన్ని తలపించింది. ఈ ఏడాది కరోనా, ఒమిక్రాన్ భయం వెంటాడినా నగరవాసులు మాత్రం తమకు పుస్తకాల మీద ఉన్న అభిమానాన్ని చాటారు. డిసెంబర్ 18 నుంచి 28 వరకు ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. ఈ ఏడాది చిందు ఎల్లమ్మ వేదికగా అనేక పుస్తకాలు ఆవిష్కృతమవగా..5 లక్షలకు పైగా సందర్శకులు తరలివచ్చారు. ముగింపు సమావేశానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు.
‘రియల్’ లీడర్‌గా..
హైదరాబాద్ మహా నగరం.. రియల్ రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. కరోనా సంక్షోభంలో ఇతర మెట్రో నగరాల్లో ఈ రంగం తిరోగమనాన్ని సూచిస్తుండగా.. హైదరాబాద్ మాత్రం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తున్నది. 2021లో హైదరాబాద్ రియల్ రంగంలోఅగ్రస్థానంలో నిలిచింది. నివాస గృహాలు, ఆఫీసు స్థలాలు, అందుబాటు ధరల్లో ఇండ్లు.. ఇలా అన్ని కేటగిరీల్ల్లో అధిక సంఖ్యలో క్రయ విక్రయాలు జరిగాయని దేశ, విదేశాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై అధ్యయనం చేస్తున్న పలు సంస్థలు తమ నివేదికల్లో వెల్లడించాయి. జేఎల్ఎల్.. నైట్‌ఫ్రాంక్.. 99ఏకర్స్.. అన్‌రాక్ లాంటి సంస్థలు రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా హైదరాబాద్ దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే ముందంజలో ఉన్నట్లుగా వెల్లడించాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు.. నిర్మాణ, రియల్ రంగాల్లో ప్రదర్శిస్తున్న పారదర్శకత.. అంతకుమించి నానాటికీ విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో వేల కోట్లతో కల్పిస్తున్న మౌలిక వసతులు.. రియల్‌రంగం గణనీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నది.
‘ప్రగతి పథం’లో ఆర్టీసీ..
జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్టీసీ 2021లో అద్భుత ఫలితాలు సాధించి ప్రగతిపథంలో సాగుతున్నది. కరోనాతో పార్సిళ్లలో ఆదాయం తగ్గినా వెంటనే తేరుకుంది. ప్రైవేట్ పర్సిళ్ల సర్వీసులతో పోల్చితే అతి తక్కువ ధరలతో కేవలం 50 శాతం తక్కువ చార్జీలు ఉండటంతో అనేక మంది వ్యాపారులు ఆర్టీసీ కార్గో సర్వీస్‌ను ఉపమోగించుకున్నారు. తద్వారా 2021లో దాదాపు 17.95 లక్షల పార్సిళ్లు బుక్ కాగా.. రూ.22.24 కోట్ల ఆదాయం వచ్చింది. జోన్ల వారీగా చూస్తే హైదరాబాద్ రూ.7.52 కోట్లు, సికింద్రాబాద్ నుంచి రూ.6.02 కోట్లు, రంగారెడ్డి నుంచి రూ.8.70 కోట్లు ఆదాయం సమకూరింది. 2020లో కార్గో సర్వీస్‌ను ప్రారంభించిన ఆర్టీసీ ఇప్పటి వరకు 24.17 లక్షల పార్సిళ్లు బుక్ కాగా.. వాటి ద్వారా రూ.29.04 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నట్లు కార్గో ఇన్చార్జి కృషకాంత్ తెలిపారు.
ఐటీలో మేటి..
యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసినా హైదరాబాద్ కేంద్రంగా ఐటీ రంగం మాత్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. 2019-20లో ఐటీ ఎగుమతులు రూ.1,28,807 కోట్లు ఉంటే.. 2020-21లో రూ.1,45,522 కోట్లకు పెరిగింది. అదేవిధంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు 2019-20లో 5,82,126 మంది ఉంటే.. 2020-21లో ఒకేసారి 6,28,615లకు పెరిగారు. ఏడాది వ్యవధిలోనే కేవలం ఐటీ రంగంలో 46,489 మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇలా ప్రతియేటా అటు ఐటీ ఎగమతులు, ఉద్యోగ,ఉపాధి అవకాశాల కల్పనలో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్టార్టప్‌లకు అత్యంత అనుకూలమైన వాతావరణం(సార్టప్ ఎకోసిస్టం) కల్పించడంలోనూ దేశంలోనే తెలంగాణ ముందువరసలో ఉంది. ఇక కొత్త కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నాయి.
పచ్చదనం కనువిందు
తెలంగాణను హరితమయం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం ప్రవేశపెట్టగా గ్రేటర్ పరిధిలో అధికారులు ప్రతి సంవత్సరం కోటి మొక్కలు నాటుతున్నారు. పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, ఔటర్ రింగు రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో, ఇతర ప్రాంతాల్లోనూ వర్షాకాలం ప్రారంభంలోనే కోటిపైగా మొక్కలు నాటి, వాటికి జియో ట్యాంగింగ్ చేస్తున్నారు. అంతేకాక నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు సమర్థవంతంగా చేపడుతున్నాయి. దీంతో నగరంలో ఎక్కడ చూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నది.
ఐదు నిమిషాల్లో..: నగరవాసులకు వేగంగా సేవలు అందించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. 100కు ఫోన్ చేసిన ఐదు నిమిషాల వ్యవధిలో హైదరాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుతుండగా.. అదే సైబరాబాద్, రాచకొండలో అరున్నర నిమిషాల్లో చేరి బాధితులకు కావాల్సిన సేవలు అందిస్తున్నారు.
ఏడాది కాలంలో 100శాతం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ముకుతాడు వేసేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విజయవంతంగా పూర్తి చేసింది. కేవలం సంవత్సరం లోపే గ్రేటర్‌పరిధిలో మొదటి డోసును 100శాతం పూర్తి చేసింది. 2021 జనవరి 16న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కరోనా వ్యాక్సినేషన్‌ను వేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తరువాత దశల వారీగా అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బందికి కరోనా తొలి, రెండవ డోసు టీకాలను వేశారు. వైద్యసిబ్బంది, పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, ఆర్టీసీ, టీచర్లు, సింగరేణి, ఆర్మీ తదితర 44 కేటగిరీలకు చెందిన వారిని హైరిస్క్ కింద పరిగణించి వేగవంతంగా వారికి వ్యాక్సినేషన్ చేపట్టారు. ఈ క్రమంలో జనవరి 16 నుంచి డిసెంబరు 28 మొదటి డోసు టీకాను 100శాతం పూర్తిచేశారు. రెండవ డోసును 63 శాతం పూర్తి చేశారు.