హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్ఆర్టీసీని కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. అందుకు నిదర్శనం డ్రైవర్లకు కండక్టర్ల బాధ్యతలు అప్పగించడమే. అధిక పనిభారంతో సతమతమవుతుండగా, దూరపు ప్రయాణాలకు కూడా కండక్టర్ డ్యూటీ చేయాల్సి వస్తున్నదని డ్రైవర్లు వాపోతున్నారు. ఒకచేతిలో స్టీరింగ్, మరో చేతితో టికెట్ ఇష్యూ మిషన్‌తో తలకు మించిన భారం గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఎక్స్‌ప్రెస్‌లలో డ్యూటీ వేసేటప్పుడు కండక్టర్ అందుబాటులో లేక బలవంతంగా టిమ్ చేతికి ఇస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అయినా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2,100 మంది కండక్టర్ల కొరత ఉండగా, మార్చిలో భారీ గా రిటైర్మెంట్లు ఉన్నాయి. గతంలో కొనుగోలు చేసిన 380 బస్సులకూ కండక్టర్లు లేరు. దీంతో తక్షణమే 1,000 కండక్టర్ పోస్టులు అవసరమని ఉన్నతాధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు మొత్తం 3వేలకుపైగా కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆర్టీసీని మొత్తం ఎలక్ట్రిక్ బస్సులతో నింపాలని ప్రభుత్వం చూస్తున్నదని, అందుకే నియామకాలు చేపట్ట డం లేదని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
డబుల్ డ్యూటీలు చేయలేమని డ్రైవర్లు మొరపెట్టుకుంటుండటంతో ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌లో నియామకాలు చేపట్టింది. దీంతో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన పోస్టులను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వ డం ఏంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం కార్మికులను నమ్మిం చి గొంతు కోస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఆర్టీసీ బతకాలంటే విరమణలకు తగ్గట్టుగా నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.