జ్యోతినగర్, డిసెంబర్ 14 : కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి, ఇప్పుడు గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాకు వచ్చింది. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రామగుండం మున్సిపల్ పరిధిలోని మూతపడిన మేడిపల్లి ఓసీపీ-4 ప్రభావిత లింగాపూర్ గ్రామ ఏరియాలో శనివారం పెద్దపులి అడుగులు పొలిన గుర్తులు ఉన్నట్టు కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఆదివారం పెద్దపల్లి జిల్లా అటవీశాఖ అధికారి సీహెచ్ శివయ్య, ఏరియా రేంజ్ ఆఫీసర్లు మేడిపల్లి ఓసీపీ-4లో పర్యటించారు. లింగాపూర్ గ్రామ శ్మశాన వాటిక ఏరియా గోదావరి తీరంలో పెద్దపులి అడుగులను గుర్తించారు. పెద్దపులి సంచారంతో సమీప లింగాపూర్, పాములపేట గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట రామగుండం, తక్కలపల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు జీ కొమురయ్య, పీ దేవదాస్, జిల్లా స్ట్రైక్ ఫోర్స్ సభ్యుడు ఎస్డీ రెహమతుల్లా, కుమార్, బిట్ ఆఫీసర్ జీ రామ్మూర్తి ఉన్నారు.