హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ మొదటి నుంచీ చెప్తున్నట్టు కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పక్షులని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నువ్వు కొట్టినట్టు చేస్తే, నేను ఏడ్చినట్టు చేస్తా.. అన్నట్టుగా ఆ రెండు జాతీయ పార్టీల తీరు ఉన్నదని ఎద్దేవా చేశారు. ఇరు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పటికే పలుమార్లు బయటపడిందని గుర్తుచేశారు. తెలంగాణలో రైతులు, ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, హైడ్రా పేరుతో నిరుపేదల ఇండ్లను సర్కారు నేలమట్టం చేస్తున్నా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
సీఎం రేవంత్‌రెడ్డి రక్తంలోనే బీజేపీ డీఎన్ఏ ఉన్నదని పేర్కొన్నారు. ప్రధాని మోదీని తన పెద్దన్నగా రేవంత్‌రెడ్డి సంబోధించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు అ న్యాయం చేశాయని విమర్శించారు. తెలంగాణ కోసం నిఖార్సుగా పోరా డే పార్టీ బీఆర్ఎస్ అని, తెలంగాణ ఆత్మగౌరవం, హకులు కాపాడటం తమ పార్టీ ఎజెండా అని తెలిపారు. కానీ బీజేపీ, కాంగ్రెస్‌లకు 100 ఎజెండాలు ఉంటాయని విమర్శించారు.