ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం అంటారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు విఫలమైన చోట మీడియా పాత్ర మొదలవుతుంది. ప్రజాస్వామ్య భారతదేశంలో మీడియాది అత్యంత కీలక పాత్ర. ‘మీడియాకు లభించే స్వేచ్ఛను బట్టి ఒక దేశం ప్రజాస్వామ్య దేశమా? కాదా?’ అని చెప్పేయవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీడియా మాత్రం ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తాలి.
నేడు మీడియా తన పాత్రను సమర్థవంతంగా పోషించడం లేదు. ‘పెట్టుబడికి కట్టు కథలకు పుట్టిన విషపుత్రికలు’ అని శ్రీశ్రీ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. పత్రికా విలువలకు కొన్ని పత్రికలు ఎప్పుడో తిలోదకాలిచ్చేశాయి. గిట్టని వారిపై తప్పుడు, విష ప్రచారం చేయడమే నేటి డైనమిక్ జర్నలిజం. అధికార పార్టీయా? ప్రతిపక్షమా? అన్న తేడా లేకుండా నిర్భయంగా ప్రశ్నించాలి. కానీ, ఆ బాధ్యత నుంచి ఆ మీడియా ఎప్పుడో తప్పుకున్నది. ఉన్నవి, లేనివి కల్పించి విష ప్రచారం చేయడమే దమ్మున్న మీడియా అన్నట్టు తయారైంది. నేటి డైనమిక్ జర్నలిజం రూపంలో నడుస్తున్న ట్రెండ్ ఇదే. తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా ఉన్నది.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంటే, బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతూ పోతున్నది. బీఆర్ఎస్ను బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేస్తున్నా గులాబీ జెండా పట్టు కోల్పోవడం లేదు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లి మరింత పట్టు సాధించింది.
బీఆర్ఎస్ను ఎలాగైనా బద్నాం చేయాలని లీక్డ్ వార్తలతో సీఎం రేవంత్ కుట్రలకు తెరతీశారు. అయితే, అవన్నీ బూమరాంగ్ అయ్యాయి. ఏడాదిన్నర పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారు. మరోవైపు, బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కాంగ్రెస్తో కలిసి నడిచిన కమ్యూనిస్టులు, కోదండరాంరెడ్డి ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్తో కలిసి ఉండటం వల్ల తాము ప్రజలకు దూరమవుతున్నామని ఎర్రజెండా నేతలు చర్చించుకుంటున్నారు. అయితే, ప్రజల్లో ఇవేవీ చర్చకు రాకుండా రేవంత్ అండ్ కంపెనీల మీడియాలు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాయి. బలహీనంగా మారిన కాంగ్రెస్ను బలంగా ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. కూడబలుక్కొని వార్తలు రాస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం పనైపోయిందని వార్త లు వండి వారుస్తున్నాయి. ఒకరేమో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్లో విలీనమవుతుందని వార్తలు రాస్తే, మరొకరేమో కాషాయ పార్టీలో గులాబీ పార్టీ విలీనం కాబోతున్నదని, ముహూర్తం కూడా ఖరారైనట్టు రాస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీలోనైనా బీఆర్ఎస్ ఎందుకు విలీనం అవుతుంది? అధికార పార్టీ ఎంపీలే బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్తున్నప్పుడు వారు కాంగ్రెస్లోకి ఎలా వస్తారు? ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన వారు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు సొంత పార్టీలోనే ముసలం మొదలైంది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పొసగడం లేదు. ఎమ్మెల్యేలు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. అన్ని కాంట్రాక్టులు ఒక్క మంత్రికే కట్టబెడుతున్నారని తిరగబడుతున్నారు.
అధికార పార్టీలో ఇంత గందరగోళంగా ఉంటే కాంగ్రెస్లో చేరేందుకు ఎవరు ఇష్టపడతారు. కానీ, మీడియా మాత్రం బీఆర్ఎస్పై లేనిపోని కల్పిత వార్తలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. విచారణలు, కేసులు అంటూ బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఆ పార్టీ తలొగ్గడం లేదు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను, నేతలను గందరగోళానికి గురిచేసేందుకు సీఎం రేవంత్రెడ్డి అండ్ భజన మీడియా గులాబీ శ్రేణులపై మానసిక యుద్ధ్దానికి తెరతీసింది. సీఎంవో నుంచి వచ్చే వార్తలకు మసాలా దట్టించి బీఆర్ఎస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారు. గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి ప్రచారమే చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడటం, గ్రామీణ తెలంగాణలో బీఆర్ఎస్ బలపడటంతో మరోసారి ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెర తీశారు. ఇలాంటి రాతల ట్రాప్లో ప్రజలు పడతారనుకోవడం భ్రమే.
– తోటకూర రమేశ్