న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే రేపోమాపో రైల్వేను కూడా ప్రైవేటుపరం చేసేలా ఉన్నదని ప్రతిపక్షాలు విమర్శించాయి. రైల్వే నిధుల కేటాయింపుపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు కే సురేశ్ మాట్లాడుతూ ‘రైల్వేకు నిధుల కేటాయింపు అంకెల గారడీలా ఉన్నది. దీనిబట్టి కేంద్రం ఉద్దేశం ఏంటన్నది అర్థమవుతున్నది. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేశారు. ఇప్పుడు రైల్వేను కూడా అమ్మకానికి పెట్టడానికి సిద్ధమవుతున్నారు’ అని ధ్వజమెత్తారు. రైల్వేలోకి ప్రత్యక్ష పెట్టుబడులను, పీపీపీలను ఆకర్షించడమే కేంద్ర ప్రభుత్వ విధానమని ఆరోపించారు. టీఎంసీ ఎంపీ శతాబ్దిరాయ్ మాట్లాడుతూ ‘రైల్వేను ప్రైవేటుపరం చేసే ఉద్దేశం కేంద్రానికి ఉందా? లేదా?.. ఒకవేళ ప్రైవేటుపరం చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి?’ అని నిలదీశారు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ రైల్వేలో భారీగా ఉద్యోగ ఖాళీలున్నాయని, వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. మరోవైపు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
పొరపాటుగానే పాక్ భూభాగంలోకి మిసైల్: రాజ్‌నాథ్‌సింగ్
మన క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైనదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత క్షిపణి పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన మంగళవారం పార్లమెంట్లో ప్రకటన చేశారు. ‘ఈ నెల 9న సాధారణ తనిఖీ, నిర్వహణ సమయంలో ప్రమాదవశాత్తూ ఒక క్షిపణి ఫైర్ అయింది. అది పాక్ భూభాగంలో పడ్డట్టు తర్వాత తెలిసింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నాం. ఘటనపై విచారం వ్యక్తంచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. మరోవైపు క్షిపణి ఘటనపై భారత్‌కు అమెరికా మద్దతుగా నిలిచింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందే తప్ప, మరోలా కనిపించట్లేదని పేర్కొన్నది. కాగా, పార్లమెంట్లో రాజ్‌నాథ్ ప్రకటనపై పాకిస్థాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈపీఎఫ్‌వో కనీస పింఛన్ వెయ్యేనా?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) అందజేస్తున్న కనీస పింఛన్ రూ.1,000గా ఉన్నదని, ఇది ఏ మాత్రం సరిపోదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తెలిపింది. ఎప్పుడో ఎనిమిదేండ్ల కిందట నిర్ణయించిన రూ.1,000 పింఛన్‌ను ఇప్పటికీ కొనసాగించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ‘పింఛన్‌పై సమీక్షించి నివేదిక ఇవ్వడానికి సంబంధిత మంత్రిత్వ శాఖ 2018లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కనీస పింఛన్‌ను రూ.2,000 చేస్తే బాగుంటుందని సూచించింది.