Accident | నిజాంపేట, ఫిబ్రవరి21: మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. అదుపుతప్పి పికప్ ట్రక్ బోల్తా పడటంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..765 డీజీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఏర్పాటు చేయు సూచిక బోర్డుల లోడ్‌తో ఉన్న టాటా పికప్ ట్రక్ వాహనంలో బిహర్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది కూలీలు సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో నిజాంపేట శివారులో గల ఇరుకుగా ఉన్న శీరిక వాగు వంతెన వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయే ప్రయత్నంలో లోడ్‌తో ఉన్న పికప్ ట్రక్ అదుపుతప్పి రోడ్డు కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో కర్ణాటకలోని రాయిచూర్ ప్రాంతానికి చెందిన కూలీ అమ్రేశ్(28) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న నిజాంపేట పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను 108 అంబులెన్స్ ద్వారా సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నట్లు ఏఎస్సై జైపాల్ రెడ్డి తెలిపారు.