ములుగు : భక్తుల కొంగు బంగారమైన శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తారు. ముందస్తు మొక్కలలో భాగంగా భక్తుల సంఖ్య ఆదివారం నాటికి 40 లక్షలకు చేరిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
క్లౌడ్ కంట్రోల్ కెమెరాల ద్వారా భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 10 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కరోనా మహమ్మారి కారణంగా ఫిబ్రవరి 16 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించే మహా జాతర వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్న భక్తులు గత సంవత్సరం డిసెంబర్ మాసం నుంచి ప్రతి బుధ, గురు, శుక్ర అది వారాల తో పాటు సెలవు దినాలలో అత్యధికంగా తరలివచ్చి ముందస్తు మొక్కులను చెల్లిస్తున్నారు.
గత జాతరలలో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ ఉన్నప్పటికిని మహా జాతర పది రోజుల ముందుగా భక్తుల సంఖ్య 40 లక్షలకు చేరేది కాదని పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు.
జిల్లా అధికార యంత్రాంగం గత రెండు నెలలుగా భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయడంతో ముందస్తు మొక్కలలో భాగంగా భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా వనదేవతలను దర్శించుకుని మొక్కలను చెల్లిస్తూ తిరుగు ప్రయాణం అవుతున్నారు.
ఇదే లెక్కన జాతర పూర్తి అయిన తర్వాత, తిరుగు వారం పూర్తయ్యే ఫిబ్రవరి 24 వరకు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు సంఖ్య కోటిన్నర వరకు చేరుకుంటుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.