న్యూఢిల్లీ, జనవరి 12: ఒమిక్రాన్‌ను సాధారణ జలుబులాగా భావించి, తేలిగ్గా తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరింది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా దవాఖానల్లో కనీసం రెండు రోజులకు సరిపడా అదనపు ఆక్సిజన్ నిల్వలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది. మూడు వందలకు పైగా జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతానికి పైగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. 442 మంది కరోనాతో చనిపోయారు. యాక్టివ్ కేసులు 10 లక్షలకు చేరువయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 11.05%, వీక్లీ పాజిటివిటీ రేటు 9.82శాతంగా ఉంది.
డిశ్చార్జి విధానంలో మార్పులు
దవాఖానల్లో కొవిడ్ చికిత్స పొందుతున్నవారి డిశ్చార్జి విధానంలో కేంద్రం మార్పులు చేసింది. మధ్యస్థ లక్షణాలు ఉండి, చికిత్స పొందుతున్నవారిలో వరుసగా మూడు రోజులు ఆక్సిజన్ స్థాయి 93% కంటే ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తిని దవాఖాన నుంచి డిశ్చార్జి చేయవచ్చని తెలిపింది. స్వల్ప లక్షణాలు ఉన్నవారిని పాజిటివ్ వచ్చిన ఏడు రోజుల తర్వాత డిశ్చార్జి చేయాలి. మళ్లీ కరోనా పరీక్ష అవసరం లేదు. దేశ రాజధానిలో కొత్తగా 27వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 26 శాతంగా నమోదైంది.
వ్యాక్సిన్ తీసుకోనివారికి ఒమిక్రాన్ ప్రమాదకరం: డబ్ల్యూహెచ్‌వో
వ్యాక్సిన్ వేసుకోనివారికి ఒమిక్రాన్ ప్రమాదకరమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. గడిచిన వారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 55% పెరిగాయని తెలిపింది. కేసులు పెరిగినప్పటికీ మరణాల సంఖ్య స్థిరంగానే ఉన్నట్టు పేర్కొన్నది. గతవారం 1.50 కోట్ల కొత్త కేసులు, 43వేల మరణాలు నమోదు అయ్యాయని వెల్లడించింది. చైనాలోని తియాంజిన్‌లో 1.4 కోట్లమందికి రెండో సారి పరీక్షలు నిర్వహించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో భాగంగా చేసిన టెస్టుల్లో 97 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో మళ్లీ పరీక్షలు చేస్తున్నారు.
ఒమిక్రాన్‌ను నిలువరిస్తున్న కొవాగ్జిన్
కొవాగ్జిన్ బూస్టర్ డోసుతో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌ను నిలువరించే యాంటిబాడీలు గణనీయంగా ఉత్పత్తి అవుతున్నాయని భారత్ బయోటెక్ ప్రకటించింది. కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేసుకొన్నవారి సీరం నమూనాలను పరీక్షించగా.. డెల్టాను నిలువరించే యాంటిబాడీలు అందరిలో, ఒమిక్రాన్‌ను తట్టుకొనే యాంటిబాడీలు 90% మందిలో ఉత్పత్తి అయినట్టు వెల్లడించింది.
నేడు సీఎంలతో మోదీ సమావేశం
కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ గురువారం అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆదివారం మోదీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పిల్లలకు సాధ్యమైనంత వేగంగా టీకా వేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.