Oil Prices : అమెరికా, ఇరాన్ (US-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేయడంతో ఇవాళ చమురు ధరలు ఆరు శాతానికిపైగా ఎగబాకాయి. పశ్చిమాసియా (West Asia) నుంచి ఇంధన సరఫరాపై నెలకొన్న ఆందోళనలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది.
అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 6.52 శాతం (4.69 డాలర్లు) పెరిగి బ్యారెల్‌కు దాదాపు 80 డాలర్ల వద్దకు చేరింది. అదేవిధంగా అమెరికా బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర కూడా 6 శాతం (4.85 డాలర్లు) పెరిగి బ్యారెల్‌కు 75 డాలర్ల సమీపంలో ట్రేడయ్యింది. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తన కథనంలో ఈ వివరాలను వెల్లడించింది. టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతిగా తమ సైన్యం రాత్రికిరాత్రి ఇరాన్‌పై కొత్త దాడులు చేసిందని ఆయన తెలిపారు. “నా వరకు ఇరాన్‌తో ఒప్పందం ముగిసిపోయింది. వాళ్లతో ఇకపై చర్చలు జరపను. వాళ్లు రోగగ్రస్తులు, హింసావాదులు. అణుబాంబు దొరికితే దాన్ని వాడటానికి కూడా వెనుకాడరు. వాళ్లతో చర్చలు జరపడం అంటే సమయం వృథా చేసుకోవడమే. వాళ్లు అబద్ధాల కోరులు” అంటూ ఇరాన్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ పరిణామం భారత మార్కెట్లపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ముడి చమురు ధరల పెరుగుదలతో మధ్యాహ్నం 3 గంటల సమయానికి సెన్సెక్స్ 1,900 పాయింట్లు (2 శాతానికి పైగా) నష్టపోయి 76,259 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా దాదాపు 600 పాయింట్లు పతనమై 23,805 వద్ద నిలిచింది.