Due Date | తెలుగు సినీ పరిశ్రమలో సుపరిచితుడైన పీఆర్ఓ, జర్నలిస్ట్ ఏలూరు శ్రీను నిర్మాతగా అవతారమెత్తుతూ, పవన్ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘డ్యూ డేట్’. వర్షిష్ స్టూడియోస్ పతాకంపై ఆనంద్.కె. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి.
లోమేష్ పూడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత పట్నాయక్, విజ్ఞాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్ ఇవ్వగా, సక్సెస్ఫుల్ నిర్మాత బన్నీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అలాగే ఇటీవల టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి చిత్ర దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ వేడుకకు దర్శకులు విజయ్ కనకమేడల, వి.ఐ. ఆనంద్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఒక బర్నింగ్ ఇష్యూ ఆధారంగా ఈ కథను రూపొందించినట్లు నిర్మాతలు తెలిపారు. టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ కోర్ట్ రూమ్ డ్రామా అందరినీ అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చెంచు జింక ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.