జైపూర్: తల్లి ఉద్యోగం, ఆస్తి కోసం కుమార్తె తన బంధువులతో కలిసి కుట్ర పన్నింది. వాహనంతో ఢీకొట్టించి హత్య చేయించింది. తన తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. (Daughter Kills Mother For Job) మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో ఈ కుట్రను పోలీసులు రట్టు చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రతాప్ నగర్లో నివసించే 45 ఏళ్ల నీరజా శర్మను జూలై 3న వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ఆమె మరణించింది. తన తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించేందుకు 23 ఏళ్ల కుమార్తె ఆయుషి తన బంధువులతో కలసి ప్రయత్నించింది.
కాగా, నీరజ సోదరుడు రాకేష్ ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేశాడు. రోడ్డు ప్రమాదంలో సోదరి చనిపోవడం వెనుక ఏదో కుట్ర ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేనకోడలు ఆయుషి, ఇతర బంధువులపై అతడు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. నీరజ మరణం ప్రమాదవశాత్తు సంభవించింది కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని తేలింది.
మరోవైపు నీరజను చంపడానికి నిందితులు రూ.7 లక్షలకు కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను నియమించుకున్నారని, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని పోలీసులు దర్యప్తులో బయటపడింది. దీంతో మృతురాలి కుమార్తె ఆయుషిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం ఆమె చెప్పింది.
ఏడాది కిందట ఆయుషి తండ్రి విజయ్ కుమార్ శర్మ మరణించగా కారుణ్య ప్రాతిపదికన న్యాయస్థానంలో క్లరికల్ ఉద్యోగాన్ని ఆయన కుటుంబానికి ఆఫర్ చేశారు. అయితే ఆ ఉద్యోగం తనకు ఇవ్వాలని ఆయుషి డిమాండ్ చేసింది. అయినప్పటికీ తల్లి నీరజ ఆ పోస్ట్ తీసుకున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆస్తి కోసం తల్లిని హత్య చేసేందుకు బంధువులతో కలిసి కుమార్తె కుట్ర పన్నిపట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆయుషి, ఆమె బంధువు, కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో సహా ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.