మధిర, మార్చి 15 : రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగుపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, ఈ పంటలకు పెట్టుబడితో పాటు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కావునా రైతాంగం తక్కువ నీరు, అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కోరారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, అదే మనమే ఆయిల్‌పామ్ సాగు చేస్తే రాబోవు రోజుల్లో ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామన్నారు. ఆయిల్‌పామ్ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలను, డ్రిప్‌ను ఇస్తుందని.. పంటను కూడా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
చింతకాని మండలంలో నాగులవంచ, సీతంపేట గ్రామాల్లో సాగర్ కాల్వలను, సాగునీరు ఆయకట్టును కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ రైతులతో ముచ్చటించారు. సాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. సాగర్ కాల్వలను కొంతమంది ఆక్రమించుకుంటున్నారని దీనివల్ల రైతులు పొలాలకు వెళ్లే అవకాశం లేకుండా పోతుందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సాగర్ జలాలను ఈ నెల చివరినాటి వరకు విడుదల చేయడం జరుగుతుందని రైతులు ఉపయోగించుకోవాలన్నారు. కాల్వలు ఆక్రమణకు గురికాకుండా వెంటనే రోడ్ నిర్మాణం చేపడతామని తెలిపారు .
Oil Palm Cultivation : ఆయిల్‌పామ్ సాగు రైతులకు లాభదాయకం : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
నాగులవంచ గ్రామంలో నేషనల్ బ్యాంక్, ఆధార్ సెంటర్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రిటైర్డ్ హెచ్ఎం అంబటి శాంతయ్య, నన్నక అప్పారావు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ తాసీల్దార్ అనంతరాజును తక్షణమే ఆధార్ సెంటర్ కు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అదేవిధంగా బ్యాంక్‌కు సంబంధించి బ్యాంక్ ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల సాగు చేసిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు నాగలవంచలో కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, మధిర ఏడిఏ స్వర్ణ విజయ్ చంద్ర, తాసీల్దార్ కూరపాటి అనంతరాజు, గిరధావర్లు రఘు, జయకృష్ణ, విద్యుత్ శాఖ ఏఈ మల్లేశ్వరి, వ్యవసాయ శాఖ ఏఓ మానస, ఏఈఓ కళ్యాణి, విద్యుత్ శాఖ సిబ్బంది, మండల నాయకులు కొప్పుల గోవిందరావు, నారపోగు కొండలరావు, తోటకూరి ప్రగతి, చట్టు వెంకటేశ్వర్లు, వంకాయలపాటి సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.