నారాయణపేట/వికారాబాద్, ఏప్రిల్ 21: లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. నారాయణపేట జిల్లాకు చెందిన వ్యక్తి తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించి ఐదుగురి బర్త్ సర్టిఫికెట్ల కోసం నిరుడు జూలైలో మీసేవలో దరఖాస్తు చేశాడు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయానికి ఫైల్ వెళ్లింది.
బాధితుడు సర్టిఫికెట్లు మంజూరు విషయమై నారాయణపేట ఆర్డీవో రాంచందర్‌ను కలువగా.. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ. 7,500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయ గా.. ఒక్కో దానికి రూ.5 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.25 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆర్డీవో రాంచందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.

తాండూరు పట్టణానికి చెందిన భార్యాభర్తల గొడవ ఇటీవల వికారాబాద్ మహిళా ఠాణాకు చేరింది. ఈ మేరకు సదరు భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులు మొత్తం ఆరుగురిపై వేధింపుల కేసు నమోదు చేశా రు. ఈ కేసు నుంచి వారిని తప్పించేందు కు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.60 వేలు ఇవ్వాలని సీఐ సరోజ డిమాండ్ చేయగా రూ.40 వేలకు బాధితుడు అంగీకరించాడు. ఇటీవల రూ.20 వేలను సీఐ సరోజ సమక్షంలో ఎస్సై రాణికి అందజేశాడు. మరో రూ.20 వేలు త్వరలో ఇస్తానని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం వికారాబాద్ మహిళా ఠాణాకు వెళ్లి సీఐ, ఎస్సైని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.