మేడ్చల్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి డీజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్‌ను గూగుల్‌తో కలిసి ప్రారంభించనున్నారు. జూన్‌లో ప్రారంభించనున్న ఆసియాలోనే అతిపెద్దదైన ఏఐ-ఏజెన్సీ క్యాంపస్‌కు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించినట్టు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి వివరించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ(ఎంఆర్జీయూ) తెలంగాణలో అతిపెద్ద విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. అన్ని విద్యా రంగాలతో కూడిన మూడు విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, వైద్య, దంత, ఫార్మసీ, నర్సింగ్ అనుబంధ ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, వ్యవసాయం వంటివి ఉన్నాయని తెలిపారు.
ఎంఆర్జీయూ జెమినీ ఎంటర్‌ప్రైజెస్‌ను తన పాఠ్య ప్రణాళికలో అనుసంధానించడం ద్వారా దేశపు మొట్టమొదటి ఏఐ-నేటివ్ విశ్యవిద్యాలయంగా రూపాంతరం చెందుతుందని, ఇది డిజిటల్ హెల్త్, ఫిన్‌టెక్, డీప్‌టెక్, అగ్రిటెక్, స్పేస్‌టెక్, ఇతర రంగాల్లో భవిష్యత్‌లో ఆరితేరిన నైపుణ్యాలు అందిస్తుందని పేర్కొన్నారు. పట్టభద్రులకు డిగ్రీలతో కాకుండా సంక్షిష్టమైన ఏఐ వ్యవ్యస్థలను నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యం, సాంకేతికత అందిస్తుందని తెలిపారు.