తిరుమల : తిరుమలలోని ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో ఆక్టోపస్ పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు హల్చల్ చేశారు. దీంతో భక్తులు కొంతసేపు ఆందోళనలకు గురయ్యారు. అసలు ఏమైందో తెలియక అయోమయానికి గురయ్యారు. తీరా ఆరా తీస్తే ఆక్టోపస్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మాక్‌డ్రిల్‌ను నిర్వహించారని తెలుసుకున్న భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తిరుపతి దేవస్థానముల ముఖ్య నిఘా, భద్రతాధికారి గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పీ సిహెచ్. వెంకట అప్పల నాయుడు ఆదేశాల మేరకు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1.00 గంట వరకు తిరుమలలోని ఒక విశ్రాంతి గృహం వద్ద ఆక్టోపస్ పోలీసు దళం, నిఘా, భద్రత విభాగం, పోలీసు, సంబంధిత శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. తిరుమలలో తరచుగా నిర్వహించే మాక్ డ్రిల్స్ కరోనా ప్రభావంతో కొద్ది కాలం వాయిదా వేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో అధికారులు మాక్ డ్రిల్‌ను పునఃప్రారంభించారు.
సంఘ విద్రోహులు తిరుమలలోని ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానముల భద్రతా దళాలు సాధ్యమైనంత త్వరగా వారిపై ఎదురుదాడి చేసి, వారి చెరలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించి, స్వామి వారి భక్తులకు ఎలాంటి అపాయం జరగకుండా, టీటీడీ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడడం ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచి ఇటువంటి మాక్ డ్రిల్ లను తరుచుగా నిర్వహించి టీటీడీ భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందో దుండగులకు ఒక హెచ్చరిక లాగా, స్వామి వారి భక్తులకు భరోసా కల్పనకు మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.