సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 ( నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు బుధవారం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆదివారం (16వ తేదీ మినహా) మిగిలిన రోజుల్లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఔత్సాహికులు ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించాలని అధికారులు తెలిపారు. 18న నామినేషన్ల పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు బరిలో ఉండే అభ్యర్థుల ప్రకటనను అధికారులు విడుదల చేయనున్నారు. ఈనెల 25వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్, కౌంటింగ్ 3 గంటల తర్వాత ఉండనున్నదని అధికారులు పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈనెల 11న తర్వాత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు లీకులు ఇవ్వడం, మరోవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, అన్నింటికంటే మించి ఎన్నికల ఏడాది కావడంతో అన్ని పార్టీలు యాక్టివిటీని పెంచాయి. ఈ నేపథ్యంలోనే డివిజన్లలో పెండింగ్ సమస్యలపై నివేదికలు తీసుకుని పరిష్కరించాలంటూ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. డివిజన్‌కు రూ.25 కోట్ల మేర నిధులు మంజూరు చేయాలని స్టాండింగ్ కమిటీ సభ్యులు కమిషనర్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. కమిషనర్ మాత్రం సర్కిల్‌కు రూ.6 కోట్ల మేర కేటాయించే దిశగా ఆలోచన చేస్తున్నారు. నాలా, ఇతర ప్రధాన సమస్యలపై ఫోకస్ చేయనున్నారు. ఇక ఎన్నికల ఏడాది కావడంలో పెండింగ్ పనులను పట్టాలెక్కించేందుకు ఆయా పార్టీల కార్పొరేటర్లు తాపత్రయ పడుతున్నారు.ఇదిలా ఉండగానే స్టాం డింగ్ కమిటీలు రావడంతో అన్ని పార్టీలు అల ర్ట్ అయ్యాయి. ఈ ఎన్నికలు ప్రతిసారి ఏకగ్రీ వం అవుతూ వస్తున్నాయి. కౌన్సిల్లో బీఆర్ఎస్, ఎంఐఎం బలంగా ఉండటంతో ఆ రెం డు పార్టీల సభ్యులే స్టాండింగ్ కమిటీలో ఉం టున్నారు. ఐతే ఇటీవల బీఆర్ఎస్ కార్పొరేటర్లు 21 మంది వరకు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేయర్ , డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండటం, ఎంఐఎం పార్టీ సైతం అధికార పార్టీతో అంటగాగుతుండడం తో ఈ సారి స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కౌన్సిల్లో 150 మంది డివిజన్లకు గానూ బీజేపీ 41, ఎంఐ ఎం 41, బీఆర్ఎస్ 40, కాంగ్రెస్ 24 సభ్యులతో బలబలాలు ఉన్నాయి. ఐతే ప్రతిసారి మాదిరిగానే బీజేపీ ఈ ఎన్నికకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నా యి. కాంగ్రెస్‌కు పెద్దగా బలం లేకున్నా వారి అడుగులు ఎటువైపు అన్నది చర్చ జరుగుతున్నది. ప్రధానంగా బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ సభ్యులే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.