జనగాం : ప్రజా పాలన పేరిట రాష్ట్రాన్ని దొంగల మాదిరిగా దోపిడీ చేస్తుందని కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) విమర్శించారు. శుక్రవారం ఆయన జనగాం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ( MLA Palla Rajeshwar Reddy ) , బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా పాలన అని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక కేసీఆర్ ( KCR ) తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.
సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కు ముందు నీళ్ళు, విద్యుత్ కోసం ప్రజలు అల్లాడిపోయారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల విద్యుత్ సరఫరా, చెరువుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం వలన ధాన్యం ఉత్పత్తి లో మొదటి స్థానంలో నిలిచి దేశానికే అన్నపూర్ణ గా మారిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్, నీటి సమస్యలు ఎందుకు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు వివరించి దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు. వారసత్వంగా వచ్చిన, పేదల ఇండ్లు, భూముల ను 22 ఏ పరిధిలోకి తీసుకొచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీ యంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నదని ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.