రాయపోల్ : ఈ ఫోటోలో కనిపిస్తున్న రైతులు ఓట్ల కోసం క్యూ లైన్ కట్టింది కాదు.. యారియా కోసం తంటాలు పడుతున్న రైతులు . సిద్దిపేట ( Siddipeta ) జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో ఆగ్రో సెంటర్( Agro Centre )కు లారీ లోడ్ యూరియా ( Urea ) రావడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తండోపతండాలుగా అక్కడికి చేరుకొని క్యూలైన్లో నిలబడ్డారు.
క్యూలైన్ కట్టిన రైతులకు కేవలం ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. వ్యవసాయ అధికారులు టోకెన్ల పద్ధతి పెట్టి రోజుల తరబడి యూరియా ఇవ్వడంతో రైతులు విలువైన పనులు వదులుకొని బస్తా యూరియా కోసం మండల కేంద్రానికి రావలసిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.
ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ క్యూ లైన్ లో నిల్చుంటే ఒక బస్తా యూరియా వస్తుందని ఆశతో క్యూ లైన్లో గంటల తరబడి నిలబడుతున్నారు. ఒక బస్తా యూరియా ఆసరనే అన్నట్టుగా రైతులు దిక్కుతోచని స్థితిలో కేంద్రాలకు వచ్చి యూరియాను తీసుకెళుతున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. వరి పంట పొట్ట దశలో ఉందని రైతులకు సరిపడా యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.