High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న డీఎస్పీ-2008 అభ్యర్థులకు సుదీర్ఘ నిరీక్షణ తప్పదా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎన్నికల కోడ్ పేరుతో వారిని ఎంత కాలం క్షోభపెడతారని ప్రశ్నించింది. ఎన్నికల ప్రవర్తనా నియామవళి అంటూ మళ్లీ నియామకాలను వాయిదా వేస్తారా? అని అసంతృప్తిని వ్యక్తం చేసింది. నియామకాలు చేపట్టకుండా ఇంకెన్నేళ్లు కాలయాపన చేస్తారని నిగ్గదీసింది. 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. పాత నోటిఫికేషన్‌ను అమలు చేసేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళితో ఎలా ముడిపెడతారని మండిపడింది. హైకోర్టు ఆదేశించాక ఎన్నికల నియమావళితో సంబంధం ఉండదని, ఎన్నికల కోడ్‌తో ముడిపెట్టడానికి వీల్లేదని, కుంటిసాకులు చెప్పి నియామకాలను వాయిదా వేయడం కుదరదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గడువును పొడిగించే ప్రసక్తే లేదని వెల్లడించింది. ఇప్పటికే నిరుద్యోగులు ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించకూడదని, ఈసారి కూడా నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.
తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ అభినందకుమార్ షావిలీ, జస్టిస్ ఈ తిరుమలాదేవి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదన వినిపించారు. డీఎస్పీ-2008 నోటిఫికేషన్‌కు సంబంధించిన 1,382 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియామకాలు చేపట్టలేకపోతున్నట్టు చెప్పారు. డీఎస్సీ-2008లో భర్తీకాని ఎన్జీటీ పోస్టులను ఏపీ తరహాలో (రిటైర్ అయ్యే వరకు కొనసాగించేలా) అర్హులైన బీఈడీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని నిరుడు హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల అమలుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైందని, క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. డీఎస్సీ-2008లో అర్హత పొందిన 2,367 మంది అభ్యర్థుల్లో 1,382 మంది కాంట్రాక్టు నియామకాలకు సుముఖత వ్యక్తం చేశారని, వారి నియామకాలకు గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంకిగా మారిందని, గత నెల 23న ఆ నోటిఫికేషన్ జారీ అయిందని వివరించారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఉద్యోగ నియామకాలు పూర్తిచేస్తామని చెప్పారు. దీనిపై హైకోర్టు ఘాటుగా ప్రతిస్పందించింది. గతంలో తాము జారీచేసిన ఉత్తర్వుల అమలుకు ఎన్నికల కోడ్ ఎలా అడ్డంకి అవుతుందని ప్రశ్నించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): చౌటుప్పల్ మండలం లకవరంలోని ఎస్ఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతోపాటు మంత్రి చేతిలోని మైక్‌ను లాకున్నట్టు 2021లో తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని, రాజగోపాల్‌రెడ్డిపై వచ్చిన అభియోగాలకు ఆధారాలు లేవని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టేయాలని, అప్పటివరకు ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై పోలీసులకు నోటీసులు జారీచేసిన జస్టిస్ కే లక్ష్మణ్.. తదుపరి విచారణను వాయిదా వేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): జన్వాడ ఫామ్ హౌస్‌పై డ్రోన్‌ను ఎగురవేసి వీడియో చిత్రీకరించిన కేసుతోపాటు తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ రెండు కేసుల్లో కౌంటర్ల దాఖలు చేయాలంటూ కక్షిదారులకు నోటీసులు జారీచేసిన జస్టిస్ కే లక్ష్మణ్.. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.