న్యూఢిల్లీ: భారతీయ విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపులు(Bomb Threats) వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. నిందితులను నో ఫ్లై లిస్టులో చేర్చనున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన వారం రోజుల్లో భారతీయ విమానాలకు సుమారు వందకుపైగా బాంబు బెదిరంపు కాల్స్ వచ్చాయి.
ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. పౌరవిమానయాన భద్రతకు చెందిన రూల్స్‌లో సవరణలు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. సివిల్ ఏవియేషన్ యాక్టు 1982 చట్టాన్ని కూడా మార్పు చేయనున్నట్లు చెప్పారు. విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపుల విషయంలో కేంద్ర హోంశాఖతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూర్టీ(బీసీఏఎస్) నిరంతరం టచ్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు.