హైదరాబాద్ : ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఏకంగా ఐదు టెస్టుల్లో ఆడటమే గాక 187 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. తన ఫిట్నెస్ను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడి సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్ ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇస్మాయిల్ మాట్లాడుతూ.. ‘అతడు (సిరాజ్) ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించాడు. జంక్ ఫుడ్‌ను తినడం పూర్తిగా మానేశాడు. హైదరాబాద్‌లో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు బిర్యానీ తినేవాడు. అది కూడా ఇంట్లో చేసిందే తప్ప బయటది తిన్లేదు.
పిజ్జాలు, చిరుతిళ్లకు పూర్తిగా దూరంగా ఉంటూ కఠినమైన డైట్ పాటించాడు’ అని తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీకి సెలక్ట్ కాకపోయిన సిరాజ్ నిరాశకు గురికాకుండా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మరింత ఎక్కువగా శ్రమించాడని.. ఫిట్నెస్ను పెంచుకోవడానికి జిమ్‌లో ఎక్కువసేపు గడిపేవాడని ఇస్మాయిల్ అన్నాడు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలంగానే ఈ సిరీస్‌లో సిరాజ్.. లాంగ్ స్పెల్స్ వేస్తూ సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసేందుకు ఉపయోగపడింది.