బాన్సువాడ, మార్చి 7: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. పట్టణంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో సోమవారం నిర్వహించిన కేసీఆర్ మహిళా బంధు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలింతలకు కేసీఆర్ కిట్లు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పేదింటి తల్లిదండ్రులకు ఆడబిడ్డ భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డ పెండ్లి ఖర్చు కోసం రూ. లక్షా 116 అందిస్తున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు పది లక్షల మంది యువతులకు రూ. 9వేల కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో 11, 500 మంది యువతులకు రూ. 500 కోట్లు అందించామని వివరించారు.
ప్రభుత్వ దవాఖానలో ప్రసవమైతే కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్థిక సాయంతోపాటు కేసీఆర్ కిట్ పథకం కోసం రూ. 1700 కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. బాన్సువాడ ప్రాంతంలోని ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా రూ. 20 కోట్లతో మాతా శిశు సంరక్షణ దవాఖానను నిర్మించినట్లు చెప్పారు. దవాఖానను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పాతబాలకృష్ణ. కౌన్సిలర్లు శ్రీనివాస్, లింగమేశ్వర్, పాశం రవీందర్, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, ఎర్వాల కృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.