నిజామాబాద్ రూరల్, నవంబర్ 11: రాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని విడనాడాలని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంటల కోసం ఆరుగాలం శ్రమిస్తున్న రైతులకు లాభం చేకూరాలనే ఉద్దేశంతో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5వేల చొప్పున పంట పెట్టుబడి సహాయాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. బోరు మోటర్ల ద్వారా పంటలను పండించేందుకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నారని తెలిపారు. సీఎం కృషితో సాగునీరు పుష్కలంగా ఉండడంతో రాష్ట్రంలోని రైతులు ఎక్కువగా వరి పంటను సాగుచేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వరి పంటను తాము కొనలేమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. యాసంగి సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. మరో పక్క రాష్ట్ర బీజేపీ నాయకులు అవగాహన లేకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం తగదన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని బాజిరెడ్డి ధ్వజమెత్తారు. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతూ స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో అనుసరిస్తున్న వైఖరిని అర్థం చేసుకోకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు రైతులను మోసం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లుతూ అబద్ధాలతో దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రైతులను అయోమయానికి గురి చేయకుండా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిర్వహించే ధర్నా కార్యక్రమానికి జిల్లా నలుమూలాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని బాజిరెడ్డి పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, టీఆర్ఎస్ నాయకులు గోర్కంటి లింగన్న, పద్మారావు, ఎస్పీ లింగం పాల్గొన్నారు.