ధాన్యం కొనుగోళ్లపై ఆంక్షలు విధించి రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ అన్నదాత పోరుబాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పెద్దఎత్తున ధర్నా కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే నిరసనల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.
నిజామాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్న కేంద్ర సర్కారు తీరును వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉమ్మడి జిల్లాలో ధర్నా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపులో భాగంగా ఉదయం 10గంటల నుంచి నిరసన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే ధర్నా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం ధర్నా కార్యక్రమాల్లో ఆయా చోట్ల పాలుపంచుకోనున్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రం వైఖరిని బట్టబయలు చేసేందుకు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కేంద్రంతో యుద్ధానికి స్వయంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు ఇవ్వడంతో ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్య కార్యకర్తలంతా కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ అసలు రంగును తేటతెల్లం చేసేందుకు రెడీ అయ్యారు.
పాల్గొననున్న ప్రజా ప్రతినిధుల
గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి ధర్నా కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యా యి. బాల్కొండ నియోజకవర్గంలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని వేల్పూర్ ఎక్స్ రోడ్డులో నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగే నిరసన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరవుతా రు. నియోజకవర్గంలోని రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరా నున్నారు. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నాను తలపెట్టారు. మాక్లూర్, నందిపేట, ఆర్మూర్ మండలాల నుంచి రైతులు ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. బోధన్‌లో జరిగే ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ పాల్గొంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు చెందిన రైతులు, గులాబీ సైన్యం భారీగా తరలి వచ్చి ధర్నాలో పాల్గొంటారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఎమ్మెల్యే గణేశ్ గుప్తా హాజరవుతారు. కామారెడ్డిలో జరిగే ధర్నాకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరు కానున్నారు. ఎల్లారెడ్డిలో రైతు ధర్నాకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్ నేతృత్వంలో కార్యక్రమం జరుగనున్నది. బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగనున్నది. జుక్కల్ నియోజకవర్గ ధర్నాను నిజాంసాగర్ మండల కేంద్రంలో తలపెట్టారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో పాటు జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దఫేదార్ రాజు హాజరవనున్నారు.
అన్నదాతల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతు అనుకూల కార్యక్రమాలతో కర్షకులకు మేలు చేస్తున్నది. భారతదేశమే గర్వించదగ్గ పథకాలను అమలు చేస్తూ రైతులను రాజు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల పొట్ట కొడుతున్నది. బాయిల్డ్ రైస్ కొనలేమంటూ భారత ఆహార సం స్థ ద్వారా లేఖలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. బాధ్యత గల ప్రభుత్వమైతే రైతు ల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని పద్ధతి ప్రకారం రాష్ట్ర ప్రభు త్వం నుంచి కేంద్రమే సేకరించాలి. ఈ ప్రక్రియ గడిచిన 74 ఏండ్ల నుంచి కొనసాగుతున్నదే. కేంద్రంలో బీజేపీ గద్దె నెక్కిన తర్వాత పరిస్థితి అంతా తారుమారు అయ్యింది. రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం స్వీకరించేందుకు ఇష్టపడడం లేదు. ఫలితంగా రాష్ర్టాల వద్ద భారీగా నిల్వలు పేరుకుపోవడంతో పాటు పండించిన పంట అంతా వృథా అవుతున్నది. పీడీఎస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఆహార ఉత్పత్తులను పంపిణీ చేయాల్సిన కేంద్రమే అనేక కొర్రీలు పెడుతూ ఇబ్బందులను సృష్టించడం ద్వారా క్షేత్ర స్థాయిలో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్రం అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా రైతు లోకా న్ని రాష్ట్ర ప్రభుత్వం చైతన్యపరుస్తోంది. ఆరుగా లం కష్టపడి పండించిన పంటను కాదంటోన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచేందుకు రైతులతో కలిసి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా రోడ్డెక్కి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.
ధర్నా స్థలాన్ని పరిశీలించిన మంత్రి
వేల్పూర్, నవంబర్ 11: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వేల్పూర్ ఎక్స్‌రోడ్‌లో నిర్వహించే ధర్నా స్థలాన్ని ఆయన రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి గురువారం పరిశీలించారు. మంత్రి వెంట ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, వైస్ ఎంపీపీ బోదపల్లి సురేశ్, టీఆర్ఎస్ నాయకుడు బబ్బూరు ప్రతాప్, సర్పంచులు అనిల్‌గౌడ్, గంగారెడ్డి, రాజేశ్వర్, సుధాకర్ ఉన్నారు.