ధర్పల్లి, నవంబర్ 10 : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలో బ్రహ్మకుమారీల భవన నిర్మాణ పనులకు బుధవారం ఆయన భూమిపూజ చేసి ఓం శాంతి జెండాను ఆవిష్కరించారు. బ్రహ్మకుమారీలు అంతకుముందు బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ ఒక మంచిపని, ఒకరికి ఉపకారం చేస్తే తిరిగి రెండింతల ఫలితాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడని అన్నారు. బ్రహ్మకుమారీలకు 400 గజాల స్థలం కేటాయించిన ఫలితంగా భగవంతుడి దయతో ఆర్టీసీకి రూ.10కోట్ల విలువైన స్థలం దక్కిందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తనకు ఫోన్ చేసి ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం సుమారు రూ.10కోట్ల విలువైన స్థలాన్ని ఇస్తానని చెప్పారని, ఇది భగవంతుడు ఇచ్చిన ప్రతిఫలమని అన్నారు. బ్రహ్మకుమారీలు ధ్యాన కేంద్రం ద్వారా మానవుల మనసుల్లోని మానవత్వాన్ని మేల్కొల్పి దైవాలుగా మారుస్తున్నారని, వారి కృషికి ప్రత్యేక అభినందనలు అని అన్నారు. స్థలం కేటాయింపునకు సహకరించిన జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్ను కూడా బ్రహ్మకుమారీలు సన్మానించారు.
అనంతరం పద్మశాలీ సంఘ భవనం వద్ద ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడీల శ్రీరాములు, ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కె.నవీన్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీస్ రాజ్‌పాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌యాదవ్, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, నాయకులు పుప్పాల సుభాష్, సురేందర్‌గౌడ్, కిశోర్‌రెడ్డి, హన్మంతోల్ల వెంకట్‌రెడ్డి, బీఎన్.రెడ్డి, పోతరాజు, బ్రహ్మకుమారీలు తదితరులు పాల్గొన్నారు.