చందూర్, నవంబర్ 10 : జ్వరమొచ్చినా.. కడుపు నొచ్చినా.. ఆర్ఎంపీ డాక్టర్ తప్ప దవాఖానల ముఖం చూడని ఆ తల్లికి పెద్దకష్టం వచ్చింది. కూలీనాలీ చేసుకొని ప్రయోజకుడిని చేయాలనుకున్న కొడుకు.. చేతికందే సమయానికి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. చికిత్స చేయించలేని దైన్యస్థితిలో ఉన్న ఆ మాతృమూర్తి.. కాలుకూడా కదపలేని కొడుకును చూస్తూ బాధపడని క్షణం లేదు.. వేడుకోని దేవుడు లేడు!
నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రానికి చెందిన కేసరి పద్మ కూలీపని చేసుకుంటూ కుమారుడు అభిలాష్‌ను ఇంటర్ వరకు చదివించింది. ఏడాదిన్నర క్రితం బోధన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిలాష్ వెన్నెముక దెబ్బతిన్నది. లంబర్స్పైన్ విరగడంతోపాటు నరాలు చిట్లిపోయాయి. హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండాపోయింది. తన కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని ఇంటిని తాకట్టుపెట్టి ఇప్పటికే రూ.మూడు లక్షలు ఖర్చు చేసింది. అయినా నడుము కిందిభాగం స్పర్శ కోల్పోయి ఆ యువకుడు మంచానికే పరిమితమయ్యాడు. మందులు, ఫిజియోథెరపీ కోసం నెలకు రూ.6-10వేల దాకా ఖర్చు చేస్తున్నది. కార్పొరేట్ దవాఖానలో ఆపరేషన్ చేస్తే మళ్లీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచించినా, పెద్దమొత్తంలో ఖర్చవుతుందని తెలుసుకొని ఆ తల్లి దిక్కుతోచని స్థితిలో ఉంది. వెనుకా ముందూ ఎవరూ లేని పద్మ.. తన కొడుకును కాపాడాలంటూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది. ఆర్థికసాయం చేసేవారు సెల్ నంబర్ 8897788358ను సంప్రదించాలి. కేసరి పద్మ, బ్యాంకు ఖాతా నంబర్ : 62418043451 (SBI చందూర్ శాఖ), IFSC కోడ్ SBIN0020368.