వనపర్తి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరిస్తామని బీజేపీ నాయకులు సాయంత్రం 5 గంటలలోగా కేంద్రం నుంచి ఉత్తరం తెస్తే తాను రాజీనామా చేస్తానని, లేకుంటే ఎంపీ పదవికి బండి సంజయ్, మంత్రి పదవికి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తారా..? అని రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి విసిరిన సవాలుకు ప్రతిస్పందన కరువైంది. వాస్తవాలకు మసిబూసి మారేడు కాయ చేయాలని ప్రయత్నించిన బండి సంజయ్.. మంత్రి చెప్పిన సమయానికి లేఖ తెప్పించకపోగా.. మూడు గంటల్లోనే దీక్షను వదిలేసి పరారయ్యారు. తన సవాలు స్వీకరించే దమ్ములేక బండి సంజయ్ తోక ముడిచాడని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే దీక్ష పేరిట బీజేపీ దొంగ నాటకాలు ఆడుతున్నదని విమర్శించారు. ఇటువంటి దీక్షలు పనిచేయవని, హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం వనపర్తిలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉదయం తాను విసిరిన సవాల్ స్వీకరించకుండా మధ్యాహ్నం 2 గంటలకే బీజేపీ నేతలు దీక్షాశిబిరం నుంచి పారిపోయారని ఎద్దేవాచేశారు. ఇటువంటి నేతలు రాష్ట్రమంతా దీక్షలు చేస్తారా? అని ప్రశ్నించారు. రైతులపై నల్ల చట్టాలను ప్రయోగించి, రైతుల చావులకు కారణమైన బీజీపీ.. రైతులకు మేలు చేస్తామని చెప్పడం దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్టుగా ఉన్నదని చురకలంటించారు. ఈ విషయంపై బీజీపే ఎంపీ వరుణ్‌గాంధీ సొంత పార్టీని విమర్శించిన సంగతి గుర్తు చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉత్తరప్రదేశ్ రైతులపై బీజేపీ మంత్రి కొడుకు వాహనం ఎక్కి తొక్కించాడని చెప్పారు. బీజేపీ చేసిన దొంగ దీక్షతో రైతులపై ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయిందన్నారు. నాలుగు నెలల నుంచి ధాన్యం సేకరించాలని అడుగుతున్నా కేంద్రంలో చలనం లేదని ధ్వజమెత్తారు. దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రం తెలంగాణకు రాసిన లేఖను చూపించినా బండి సంజయ్ మళ్లీ అడగడం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు. ఇంగ్లిష్ రాకుంటే ఆ భాష వచ్చిన వారితో చదివించుకోవాలని బండికి సలహా ఇచ్చారు. సమావేశంలో వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.