హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): పత్తి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని పత్తి విత్తన కంపెనీలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. నాణ్యత లేకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రైతులకు నష్టం జరగకుండా, పత్తి విత్తనోత్పత్తి కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోకుండా రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీలు సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పత్తి విత్తనోత్పత్తి రైతుల సమస్యలపై మంగళవారం హైదరాబాద్ నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తెలంగాణ పత్తి అత్యంత నాణ్యమైనదని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 35 వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తి జరుగుతున్నదని చెప్పారు.
దేశంలో అవసరమయ్యే పత్తి విత్తనాల్లో ఎక్కువ శాతం రాష్ట్రంలోనే ఉత్పత్తి కావడం గర్వకారణమని పేర్కొన్నారు. పత్తి విత్తనాల్లో మన ఖ్యాతిని మరింత పెంచాలని సూచించారు. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తనోత్పత్తి రైతులు పాల్గొన్నారు.