e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News కొంగ జపం..దొంగ దీక్ష..

కొంగ జపం..దొంగ దీక్ష..

 • ధాన్యం సేకరణపై కేంద్రం విముఖత
 • రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ దారుణ వైఖరి
 • కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్రం యత్నం
 • ఢిల్లీలోనే ఉన్న మన ఉన్నతాధికారులు
 • యాసంగి పంట 21 లక్షల టన్నులు
 • ఇప్పటికీ మన రాష్ట్రంలోనే
 • సేకరించే ధాన్యంపై కేంద్రం దోబూచులు

నలుగురు మనుషులు వెనక, నాలుగు వరి కంకులు ముందు పెట్టుకుని, 11 నుంచి 2 గంటల వరకు, కేవలం మూడే మూడు గంటల సుదీర్ఘ ‘దీక్ష’కు దిగిండు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఎన్నికో, ఉప ఎన్నికో రాగానే సంజయ్‌కి దీక్ష గుర్తొస్తుంది! మరి ఈ తాజా దీక్ష ఎందుకు? ఎవరి కోసం?

- Advertisement -

వరి రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదట. వరి ధాన్యం కొనను అంటున్నదట!
సంజయ్‌ జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటుంది!
రైతులూ మనసు పెట్టి అర్థం చేసుకోవాలి.

వడ్లు తీసుకుంటాను అని కేంద్రం అంటుంటే..కేసీఆర్‌ మాత్రం.. నేను కొని పంపను, పంపనంటే పంపను అంటున్నారా?
దొడ్లు వడ్లు తీసుకోం, దొడ్డు వడ్లు సాగు చేయవద్దు, వద్దంటే వద్దు, వద్దే వద్దు అని వారానికోసారి ఎఫ్‌సీఐ (ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా), కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ బహిరంగంగా ప్రకటిస్తున్నారా? లేదా?
మరి వడ్లు తీసుకోం అని కేంద్రం ప్రకటిస్తే, బండి సంజయ్‌ ఎవరి మీద దీక్షకు దిగినట్టు?
దీక్షలో కూర్చున్న సంజయ్‌.. ప్రతి గింజా మేం తీసుకుంటాం అన్నారు.

తీసుకొనేది సంజయ్‌ కాదు, కేంద్ర ప్రభుత్వం. సాయంత్రం 5 లోపు కేంద్రం నుంచి ఆమేరకు లేఖ తెప్పించాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరితే సంజయ్‌ ఎందుకు తెప్పించలేకపోయారు? లేఖ కాదు, తెలంగాణలో ఎంత ధాన్యం పండినా మేమే తీసుకొంటాం అని కనీసం ఒక ప్రకటననైనా ఎందుకు ఇప్పించలేకపోయారు?
కేంద్రం నుంచి కాగితమే తెప్పించలేని సంజయ్‌, ధాన్యం తీసుకునేలా ఎలా ఒప్పిస్తడు? పసుపుబోర్డు తెస్తానని ధర్మపురి అరవింద్‌ రాసిచ్చిన బాండ్‌ పేపర్‌ లాంటిదే ఇది కూడా..

 • ఒక నక్క ప్రమాణం చేసిందట..ఇంకెవర్నీ మోసగించనని!
 • ఒక పులి పశ్చాత్తాప పడిందట..తోటి జంతువుల్ని చంపినందుకు!
 • ఒక కొంగ జప దీక్షకు దిగిందట..చెరువులోని చేపలను ఉద్ధరిస్తానని!
 • తెలంగాణలో ఇప్పుడు బీజేపీ రాజకీయం ఇలాగే సాగుతున్నది.
 • ఇలాంటి కట్టుకథలు విని, నమ్మి, మోసపోయేందుకు మనమేమైనా గొర్రెలమా, చేపలమా?

నిన్న మొన్ననే నీళ్లు తెచ్చుకొని బాగుపడదామనుకున్న వరి రైతులను దగా అన్యాయం చేస్తున్నది కేంద్రం. వరి సాగు వద్దంటున్నది కేంద్రం.
వడ్లు తీసుకోం అంటున్నది కేంద్రం. యాసంగి వడ్లు ఇప్పటికి కూడా పూర్తిగా తీసుకోనిది కేంద్రం.పోనీ ఎంత సేకరిస్తారో సీజన్‌కు ముందే చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడిగితే, ఇప్పటికీ చెప్పకుండా నాన్చుతున్నది కేంద్ర ప్రభుత్వం.‘మీ దగ్గర అంత వరి లేదే! మా శాటిలైట్‌లో కనిపించడం లేదు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.

తప్పులన్నీ తన పార్టీలో పెట్టుకుని సంజయ్‌.. దొంగే దొంగా దొంగా అన్నట్టు.. రైతులు, జనం నవ్వుతారన్న ఇంగితం కూడా లేకుండా దీక్ష చేస్తాడట.. దీక్ష..!

ఏదో ఒక డ్రామా చేయాలి.. అబద్ధాలాడాలి.. ఉద్వేగాలు లేపాలి.. జనాన్ని రెచ్చగొట్టాలి.. 4 ఓట్లు వేయించుకోవాలి.. పత్తా లేకుండా పోవాలి.
ఇదీ రాష్ట్ర బీజేపీ నేతల ఎజెండా.

బండి సంజయ్‌ కొంగ దీక్ష.. దొంగ దీక్ష రైతుల కోసం కాదు. హుజూరాబాద్‌లో ఓట్ల కోసం! హుజూరాబాద్‌ ఓటర్లకూ, మన తెలంగాణ ప్రజలకు తెల్వదా రైతుల కోసం ఎవరేం చేస్తున్నరో..!

ఉత్తరాదిలో రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదో.. ఎవరు కార్లతో తొక్కించిప్రాణాలు తీస్తున్నరో.. ఎవరు లాఠీలతో కొట్టిస్తున్నరో..

తెలంగాణలోఎవరు రైతుల పొలాల్లోకి నీళ్లు పారిస్తున్నరో.. రైతు బంధు, రైతు బీమా ఎవరిస్తున్నరో..
ఎవరు రైతు ముంగిటికి వచ్చి ధాన్యం కొంటున్నరో..

రైతుల కోసం కేసీఆర్‌ పెట్టినన్ని పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నయా? ఇంటి పెద్ద చనిపోయి ఆపదలో పడ్డ రైతు కుటుంబానికి మోదీ ప్రభుత్వం కానీ, దేశంలో మరే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎర్ర ఏకాన అయినా ఇస్తున్నదా?

హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (నమస్తే తెలంగాణ): ఊసరవెల్లి రాజకీయం అంటే ఏమిటో బీజేపీ నేతలను చూసే నేర్చుకోవాలి. ఓ పక్క రైతన్నను నిలువెల్లా దహనం చేయడానికి నల్లచట్టాల చితిని పేరుస్తరు. ఇంకోపక్క పండించిన పంటను సేకరించకుండా దిగుబడికి కొరివి పెడుతరు. ఊళ్లల్లకొచ్చి.. ఓట్ల దగ్గరకు వచ్చేసరికి.. అయ్యయ్యో రైతుకు రాష్ట్రమే అన్యాయం చేస్తున్నదంటూ.. పానమొడ్డి అయినా అడ్డుకొంటామంటూ దొంగ దీక్షలు చేపడతారు. దేశంలో ధాన్యం సేకరించాల్సింది కేంద్రం.. మద్దతు ధర ప్రకటించి వాళ్లను ఆదుకోవాల్సింది కేంద్రం. రైతుల దగ్గర కొని అప్పగించే బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది? కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం పెట్టుకొని.. ధాన్యం సేకరించడానికి ఒప్పించాల్సిందిపోయి.. హైదరాబాద్‌లో కూర్చొని చేతుల్లో వరికంకులు పట్టుకొని ఉద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకొంటున్నదెవరు? తెలంగాణ నుంచి యాసంగి ధాన్యం సేకరించేది లేదని కేంద్ర మంత్రులు, భారత ఆహార సంస్థ తెగేసి చెప్తాయి. ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారులు పదే పదే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి, మంత్రులను కలిసి విజ్ఞాపనలు ఎన్ని చేసినప్పటికీ.. రైతులను ఆదుకోవడానికి కించిత్తు కూడా నిబద్ధత చూపకుండా సహాయ నిరాకరణ చేస్తున్న ఈ దారుణాన్ని ఏమని నిర్వచించాలి? ఓ పక్క దొడ్డు వడ్లు సేకరించేది లేదని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. మరోపక్క ఆ పార్టీకే చెందిన బండి సంజయ్‌.. రెండుమూడు గంటల ఉత్తుత్తి దీక్షలు చేసి మీడియాలో ఉపన్యాసాలు దంచేస్తుంటారు. రైతు పండించిన ప్రతి గింజనూ కేంద్రం సేకరిస్తుందంటారు. అందుకు మాది పూచీ అంటారు.

రాష్ట్ర ప్రభుత్వమే కొనడం లేదని, వరికి ఉరి వేస్తున్నదని చెప్తారు. ఒక పార్లమెంట్‌ సభ్యుడిగా కేంద్రం తీసుకొచ్చిన నల్లచట్టాలను బాజాప్తా ఆమోదించిన బండి.. ఇప్పుడు హుజూరాబాద్‌ ఓట్ల కోసం కట్టుకథలతో.. కేంద్రం సేకరిస్తానంటున్నా రాష్ట్రమే తీసుకోవట్లేదన్నట్టుగా పచ్చి అబద్ధాలాడుతూ మీడియాముందు ప్రదర్శన చేస్తున్నారు. వాస్తవానికి బండి సంజయ్‌ మొక్కుబడి దీక్ష దుకాణం బందువెట్టి పోయిన సమయానికి కూడా.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక, పౌర సరఫరాలు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శులు ముగ్గురు ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రాన్ని ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి వారు ఢిల్లీలోనే కేంద్రంతో సంప్రదింపులు జరిపే కార్యక్రమంలో ఉన్నారు. కానీ, కేంద్రం మాత్రం అత్యంత దారుణంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్నది.

కేంద్రం దారుణం 1

గత వానకాలం సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 93 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసింది. ఇందుకు సంబంధించి 62 లక్షల టన్నుల ఉప్పుడుబియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉన్నది. కానీ ఎఫ్‌సీఐ 24.75 లక్షల టన్నులు మాత్రమే తీసుకొంటానని కొర్రీ పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌తో రెండుసార్లు భేటీఅయి మాట్లాడారు. మిగతా 37.25 లక్షల టన్నులనూ సేకరించాలని కోరారు. ఈ సీఎమ్మార్‌లో ఇంకా 21 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉన్నది. సీఎం కేసీఆర్‌ చొరవ చూపితేనే ఈ మాత్రమైనా తీసుకొన్నది. ఇప్పుడేమో వచ్చే యాసంగిలో ఒక్క గింజ కూడా తీసుకొనేది లేదని మొండికేసింది. మరీ ఇంత దారుణమా? మరి యాసంగిలో వరి రైతులు ఏం చేయాలి? బండి సంజయ్‌ చెప్తున్నట్టు వరి వేసి.. కేంద్రం సేకరించక.. పంటను అమ్ముకోలేక.. ఆగమైపోవాలా?

కేంద్రం దారుణం 3

ఎంత పంట పండించాలో కేంద్రం కానీ, ఎఫ్‌సీఐ కానీ చెప్పలేదు. వాళ్లు చెప్పలేదు సరికదా అని ‘ఈ వానకాలంలో మా రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ఆ వివరాలు ఇవీ..’ అని తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌సీఐకి నివేదిక ఇచ్చింది. ఆ ప్రకారంగానైనా ఎఫ్‌సీఐ వ్యవహరించిందా అంటే అదీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికను కొట్టిపారేసింది. ‘మేం ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా మీ రాష్ర్టాన్ని పరిశీలించినం.. మీ రాష్ట్రంలో అంత విస్తీర్ణంలో వరి సాగు కానేలేదు’ అంటూ వితండంగా జవాబిచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఓపికగా సమాధానమిచ్చింది. ‘మేం ప్రతి గ్రామంలో, మండలాల్లో వ్యవసాయ విస్తీర్ణాధికారులను నియమించుకొన్నం. వారు క్షేత్రస్థాయిలో గుంట గుంటను లెక్కబెట్టి కచ్చితమైన గణాంకాలు అందించారు. మీకు ఇంకా అనుమానం ఉంటే ఓ బృందాన్ని పంపిస్తే.. నేరుగా వెళ్లి ఫీల్డ్‌ స్టడీ చేయడానికి వీలవుతుంది కదా’ అని విజ్ఞప్తిచేసింది. కానీ.. ఎఫ్‌సీఐ నుంచి ఉలుకూపలుకూ లేదు. ఇదంతా కూడా ధాన్యం సేకరణలో కోతలు పెట్టాలన్న ఉద్దేశమే కనిపిస్తున్నది. వాళ్లు చెప్పరు. మన ప్రభుత్వం చెప్పితే దాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఇక వీళ్లు రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మాట్లాడే మాటలకు విలువేమున్నది?

కేంద్రం దారుణం 2

మొన్న సెప్టెంబర్‌ 25న సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర మంత్రులు, అధికారులు, ఎఫ్‌సీఐ అధికారులతో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో కేంద్ర అధికారులు.. ‘మీ దగ్గర ఎక్కువ ధాన్యం వస్తున్నది.. వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకొనే ప్రసక్తే లేదు’ అని తేల్చి చెప్పారు. అప్పుడు సీఎం కేసీఆర్‌ కల్పించుకొని వారి ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ‘పోనీ ప్రతి సీజన్‌కు ముందే మీరు ఎంత ధాన్యం సేకరిస్తారో చెప్పండి. అంతే ధాన్యం ఇస్తాం. ఆ మేరకే సాగుచేయాలని మా రైతులను కోరుతాం’ అని చెప్పి వచ్చారు. ఇప్పటికి నెల దాటింది. కేంద్రం నుంచి కానీ, ఎఫ్‌సీఐ నుంచి కానీ ఎలాంటి జవాబు రాలేదు. ఇంత ధాన్యం సేకరిస్తామని కానీ, ఇంతే పండించండని కానీ, నామమాత్రంగానైనా చెప్పలేదు. ఇదీ వరి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల కేంద్ర ప్రభుత్వానికి , బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి.

అవకాశం ఇస్తే కొని, ఎగుమతి చేస్తాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ఉప్పుడు బియ్యాన్ని కొని విదేశాలకు ఎగుమతి చేసేందుకు మేం సిద్ధంగా ఉ న్నాం. కానీ, అంతర్జాతీయ ధరకు, ఇక్కడి మద్దతు ధరకు మధ్యగల వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు భరించగలగాలి. అప్పుడు సగానికి పైగా ధాన్యా న్ని రైతుల నుంచి మేమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. దీంతో అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలే తప్ప.. ధాన్యం సేకరించబోమని చెప్పడం సమంజసం కాదు.

కృష్ణారావు, అధ్యక్షుడు ఇండియన్‌ రైస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోయేషన్‌

మిల్లింగ్‌ రంగానికి పెద్ద దెబ్బ

ఉప్పుడు బియ్యం కొనబోమని ఎఫ్‌సీఐ చెప్పడం వల్ల రాష్ట్రంలో మిల్లింగ్‌ రంగం కుదేలవుతుంది. రైతులకు కూడా తీరని నష్టం జరుగుతుంది. ఈ సమస్యకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. కేంద్రం, ఎఫ్‌సీఐ రైతుల పక్షాన ఆలోచించాలి.

గంప నాగేందర్‌, అధ్యక్షుడు, రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement