హైదరాబాద్ : సాగునీటి రంగంలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్. కేసీఆర్ నాయకత్వంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ నీటిని ఆంధ్రాకు వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తాత్కాలిక ఒప్పందంలో కృష్ణా జలాల్లో కేంద్రం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రా వ్యవహరిస్తున్నది.
ఎలాంటి ఇండెంట్లు లేకుండా ఆంధ్రాకు నీటిని తరలిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. గత రెండేళ్లలో ఏపీ అతి ఎక్కువగా నీళ్లను తరలిస్తే, తెలంగాణ అతి తక్కువగా వాడుకున్నది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. నల్లగొండ, పాలమూరు జిల్లాలో పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నాయి. నోటికాడికి వచ్చే బుక్క నేలపాలవుతుంది. రైతుల కష్టార్జితం నాశనం అవుతుంది.
సర్కార్ నడుపుతున్నారా ? సర్కస్ నడుపుతారా ? అని ప్రశ్నించారు. కేంద్రం పరిధిలో ఉన్న కేఆర్ఎంబీ తెలంగాణకు చేస్తున్న అన్యాయం గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కనాడు కూడా ఎందుకు ప్రశ్నించరు ? తెలంగాణకు సాగునీటిలో జరుగుతున్న అన్యాయం మీద ఒక్కనాడు ఎందుకు అడగరన్నారు. ఏపీ ప్రభుత్వం ఇంటర్ బేసిన్ ట్రాన్స్ ఫర్ కు వ్యతిరేకంగా కృష్ణా బేసిన్ లో లేని హాంద్రి నీవా, పెన్నా బేసిన్ , గాలేరు నగరి కి తరలిస్తున్నది.
ఇప్పుడు బనకచర్లతో ముందుకు గోదావరి జలాలు కృష్ణాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 45 రోజులు ఆలస్యంగా ఎత్తిపోతల పంపులు ప్రారంభించారన్నారు. ఈ ఏడాది అత్యధికంగా కృష్ణా నదికి వరదలు వచ్చాయి . సాగునీరు ఎత్తిపోసుకోకపోవడమే కాకుండా.. ఏపీ జలదోపిడీని నిరోధించలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వారాల ముందే హెచ్చరించినా ఈ ప్రభుత్వం మేలు కోలేదు. సాగునీటి దోపిడీని అడ్డుకోకుండా ఇప్పుడు పంటలు ఎండిపోయేటప్పుడు శ్రీశైలం వద్ద తీరిగ్గా ధర్నా చేస్తున్నారని అన్నారు.
నీళ్లు మలుపుకునుడు చేతగాక, వెళ్లిపోయిన నీళ్ల కోసం శ్రీశైలం డ్యాం వద్ద ధర్నా చేస్తున్నారు. మీకు దమ్ముంటే, మీకు ప్రజలు, రైతుల ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, మీకు పదవీలాలస లేకుంటే మిగిలిపోయిన పాలమూరు పనులు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. కేఎల్ఐ ఎత్తిపోతలను సక్రమంగా వాడితే 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.
రిపేరులో ఉన్న రెండు పంపుల మరమ్మతులకు రూ.10 కోట్లు ఇవ్వకుండా రెండేళ్లుగా పెండింగులో పెట్టారు. 5 పంపులు నడిపితే సమృద్ధిగా నీరు వాడుకోవచ్చన్నారు. పాలమూరు- రంగారెడ్డి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు.