ముంబై : మహారాష్ట్రలోని ముంబైలో విషాదం చోటు చేసుకున్నది. మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని న్యూకలెక్టర్ కాంపౌండ్లో బుధవారం రాత్రి ఓ నివాస భవనం కూలిపోయింది. ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో మంది ఎనిమిది గాయపడగా.. వారిని దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మహిళలు, పిల్లలు సహా మరో 15 మందిని రక్షించి ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమీపంలో ఉన్న రెండు భవనాలు సైతం సరైన స్థితిలో లేనందున వాటిలో ఉంటున్న వారిని సైతం ఖాళీ చేయించి కూల్చివేసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై రాష్ట్ర మంత్రి అస్లాం షేక్ మాట్లాడుతూ భారీగా కురిసిన వర్షం కారణంగా భవనం కూలిపోయిందని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన వారిని హాస్పిటల్లో చేర్పించారన్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? లేదా? తెలుసుకునేందుకు శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నాయన్నారు.
రుతుపవనాలతో భారీ వర్షం
ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షం కురిసిందని ఐఎండీ బుధవారం తెలిపింది. ఉదయం నుంచే ఆర్థిక రాజధానితో పాటు పలు ప్రాంతాలు వర్షానికి అనేక ప్రదేశాలు నీటితో నిండిపోయాయి. దీంతో లోకల్ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. శాంటా క్రజ్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆరు గంటల్లో 164.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది.
#UPDATE | 15 people including women & children have been rescued & are shifted to the hospital. There is a possibility of more people stuck under the debris. Teams are present here to rescue people," says Vishal Thakur, DCP Zone 11, Mumbai pic.twitter.com/MKGPdp3kcA
— ANI (@ANI) June 9, 2021