Adani | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): పోటీ లేకుండా కాంట్రాక్ట్‌లను దక్కించుకొని, అధిక ధరలకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా పలు రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు భారీ లంచాలను ఆఫర్ చేసిన ‘అదానీ సోలార్ స్కామ్’ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. గత నెల 31నే గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ రెడీ అయినా అది జారీ మాత్రం కాలేదు. కేసు విషయాలూ బయటకు పొక్కలేదు. కేసు గురించి బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చేసిందెవరన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. లంచాలకు స్కెచ్ ఎలా జరిగింది అన్న విషయం బయటకు వచ్చింది. మరోవైపు ఈ కేసు విషయమై కేంద్రం విచారణ జరపాలని అదానీ గ్రూప్‌తో సౌర విద్యుత్తు ఒప్పందాలు చేసుకున్న రాష్ర్టాల నేతలు కోరారు. తాము అదానీ గ్రూప్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తెలిపారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైనందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పోటీ లేకుండా కాంట్రాక్ట్‌లను దక్కించుకొని, అధిక ధరలకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా పలు రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు భారీ లంచాలను ఆఫర్ చేసిన ‘అదానీ సోలార్ స్కామ్’లో కొత్త కో ణం వెలుగు చూసింది. అందరూ అనుకొంటున్నట్టు అదానీ గ్రూప్ సంస్థల చైర్పర్సన్ గౌతమ్ అదానీపై అమెరికా కోర్టు గురువారం రోజే అరెస్ట్ వారెంట్‌ను సిద్ధం చేసి జారీ చేయలేదు. గత నెల 31నే గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ రెడీ అయ్యింది. అయితే, ఆ వారెంట్ మాత్రం జారీ కాలేదు. కేసు విషయాలూ బయటకు పొక్కలేదు. అదానీపై అరెస్ట్ వారెంట్‌ను దా దాపు 22 రోజులపాటు నిలుపుదల చేయించిందెవరు? కేసు గురించి ప్రపంచానికి తెలియనీయకుండా చేసిందెవరన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
అసలేం జరిగింది?
దేశంలో సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకొనేందుకు ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,238 కోట్ల) మేర లంచాలు ఇచ్చారనే అభియోగాలపై అమెరికాలోని ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు గౌతమ్ అదానీతోపాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీకి అక్కడి కోర్టు గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే, గౌతమ్ అదానీపై అరెస్ట్ వారెంట్ మాత్రం అక్టోబర్ 31నే రెడీ అయ్యింది. ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయా ర్క్ కోర్టు న్యాయమూర్తి రాబర్ట్ ఎమ్ లేవీ ఈ మేరకు ఆదేశాలిచ్చారని జాతీయ మీడియా ‘ఇండియా టుడే’ ఒక కథనంలో వెల్లడించింది. అదానీ అక్రమాలపై అక్టోబర్ 31నే దీనే అరెస్ట్ వారెంట్ సిద్ధమైనప్పటికీ, 22 రోజుల అనంతరం దాన్ని జారీ చేయడం, ఇన్ని రోజులపాటు కేసు విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.
ఏడాదిన్నర కిందటే ఫోన్లు సీజ్
‘సోలార్ స్కామ్’లో లంచాలకు సంబంధించి ఎవరికి ఏమేరకు చెల్లించారు? ప్రతిఫలంగా ఏయే కాంట్రాక్టులు దక్కాయన్న అన్ని ఆధారాలు సాగర్ అదానీ ఫోన్లో తమకు లభించాయని ఎఫ్‌బీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు గత ఏడాది మార్చిలో ఎఫ్‌బీఐ ప్రత్యేక ఏజెంట్లు సాగర్ అదానీని సెర్చ్ వారెంట్‌తో రెండుమార్లు కలిశారని, అమెరికాలో ఒకసారి, భారత్‌లో మరోసారి సాగర్‌ను విచారించినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు.
లంచాల స్కెచ్ ఇలా
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (సెకీ) నుంచి ఎలాగోలా టెండరు దక్కించుకొన్నప్పటికీ, అధిక ధరలను కోట్ చేయడంతో విద్యుత్తు కొనుగోలుకు రాష్ర్టాల డిస్కమ్‌లు ముందుకు రాకపోవడంతో అదానీపై ఒత్తిడి పెరిగినట్టు సమాచారం. ఈ క్ర మంలోనే డీల్ కోసం వివిధ రాష్ర్టాల్లోని అధికారులకు లంచాల ఎరకు తెర తీసినట్టు తెలుస్తున్నది. ఈ స్కెచ్‌ను సాగర్ అదానీ దగ్గరుండి నడిపినట్టు ఎఫ్‌బీఐ ఆరోపించింది. ఒక్కో మెగావాట్ కొనుగోలుకు రూ.25 లక్షల చొప్పున లంచం ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు వెల్లడించింది.
మరి ఇప్పుడు ఎందుకు?
జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలపై ప్రతి కూల ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతోనే వారెంట్ జారీని 22 రోజులపాటు వాయి దా వేయించి ఉండొచ్చని ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. ఇ ది నిజమేననిపించేలా.. పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే అదానీ అక్రమాల కహానీ బయటకు రావడం గమనార్హం.
అమెరికాకు అప్పగించాల్సిందే
గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన నేరారోపణలు రుజువైతే ఆయన్ని భారత్.. అమెరికాకు అప్పగిస్తుందా? అనే చర్చ జరుగుతున్నది. ఇండియా-అమెరికా మధ్య వాషింగ్టన్లో జూన్ 25, 1997లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరింది. అమెరికాలో నమోదైన అభియోగాలు నిరూపితమైతే అక్కడే శిక్ష అనుభవించాల్సి ఉంటుం ది. ఇక నేరం రుజువైతే అదానీని అమెరికాకు భారత్ అప్పగించాల్సి ఉంటుంది.
బయటపడింది ఇలా.. 22 నెలల కిందట అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీల్లో స్టాక్ మ్యానిప్యులేషన్ జరిగినట్టు సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై అమెరికాలోని బ్రూక్లిన్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగుతున్నది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయవాదులకు సోలార్ ఎనర్జీ కాంట్రాక్టు టెండర్లలోనూ అక్రమాలు జరిగినట్టు అనుమానాలు వచ్చాయి. దీంతో వాళ్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అక్కడి మీడియా వెల్లడించింది. అమెరికాకు అదానీని భార త్ అప్పగించే ప్రక్రియ ఒక్కరోజులో జరిగే పనికాదని న్యాయనిపుణులు చెప్తున్నారు.
అదానీతో ఒప్పందాలను సమీక్షిస్తాం:టీపీసీసీ చీఫ్
అదానీతో తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు చట్టవిరుద్ధంగా ఉంటే వాటిని రద్దు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. అదానీ కంపెనీలతో ఒప్పందాలపై సీఎం రేవంత్‌రెడ్డికి స్పష్టత ఉన్నదని, రాహుల్‌గాంధీ అభిప్రాయమే తమందరి అభిప్రాయమని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. దోషులుగా తేలితే వాళ్లు కాంగ్రెస్ పార్టీ వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి అదానీ రూ.100 కోట్ల విరా ళం ఇచ్చిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. అవి స్కిల్ యూనివర్సిటీ కోసం ఇ చ్చారని, ఒకవేళ అది చట్ట విరుద్ధమైతే రద్దు చేస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో అదానీని రాహుల్‌గాంధీ వ్యతిరేకిస్తుంటే.. తెలంగాణలో మాత్రం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నదని ప్రశ్నించగా.. అందరితో చేసుకున్నట్టుగానే అదానీతోనూ ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపారు.