చేపడుతున్న పంచకుండాత్మక మహా కుంభాభిషేక పర్వం వైభవంగా సాగుతున్నది. పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తున్న మహాక్రతువులో నాలుగో రోజు గురువారం ఉదయం బాలాలయంలో శాంతి పాఠం, చతుఃస్థానార్చన, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు నిర్వహించారు. ప్రధానాలయంలో పంచవింశతి కలశ స్నపనం, నిత్య లఘు పూర్ణాహుతి వైభవోపేతంగా సాగాయి. సాయంత్రం బలాధివాసం, నిత్యలఘు పూర్ణాహుతి చేపట్టారు.
యాదాద్రి, మార్చి 24 : యాదాద్రిలో సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక మహోత్సవ పర్వాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం ఉదయం 9 గంటలకు బాలాలయంలో శాంతి పాఠం, చతుస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు నిర్వహించారు. స్వయంభువుల ప్రధానాలయంలో పంచవింశతి కలశ స్నపనం, జలాధివాసం, నిత్య లఘుపూర్ణాహుతి పర్వాలు వైభవోపేతంగా సాగాయి. సాయంత్రం 6 గంటలకు బాలాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, యాగశాలలో మూలమంత్ర హవనం, చతుస్థానార్చన నిర్వహించారు.
ప్రధానాలయ ముఖ మండపంలోని ఉపాలయాల్లో పునఃప్రతిష్ఠించే శిలామయమూర్తులు, మహాసుదర్శన చక్రం, ధ్వజస్తంభం, బలిపీఠాలకు ‘పంచ వింశతి కలశ స్నపనం’ తంతును శాస్ర్తోక్తంగా జరిపారు. 25కలశాల్లో శుద్ధోదకాలతోపాటు పవిత్ర ఔషధి తతములతో, సుగంధ ద్రవ్యాలతో కూడిన మంత్రపూరిత జలాలను శిలామూర్తులైన ఆండాళ్ అమ్మవారు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు, రామానుజ విగ్రహాలతోపాటు మహా సుదర్శన చక్రం, బలిపీఠం, ధ్వజస్తంభానికి అభిషేకం జరిపించారు. శిలామూర్తుల అభిషేకంతో విగ్రహాలలోని తేజస్సును ద్విగుణీకృతం చేసే వైదిక ప్రక్రియ సాగింది. మహాకుంభాభిషేక మహోత్సవంలో పంచవింశతి కలశ స్నపనం వేద ప్రసిద్ధమైనదని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.
బాలాలయంలో సాయంత్రం 6 గంటలకు సువర్ణమూర్తులకు నిత్యారాధన అనంతరం సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, మూలమంత్ర, మూర్తి మంత్ర హవనం, చతుస్థానార్చనలతో పాటు పంచకుండ యాగాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, శ్రీధరాచార్యులు, ఆలయ అధికారులు దోర్బల భాస్కర శర్మ, గజవెల్లి రమేశ్‌బాబు, గట్టు శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ప్రధానాలయంలో సాయంత్రం 6 గంటలకు శిలామూర్తులకు జలాధివాసం ఉత్సవం పాంచరాత్రాగమశాస్త్రరీతిలో జరిగింది. ప్రధానాలయంలో ప్రత్యేకమైన కొలను ఏర్పాటు చేసి గోదావరి సహా వివిధ నది, సముద్ర జలాలతో అభిషేకం జరిపించారు. శిలామూర్తులైన ఆండాళ్ అమ్మవారు, విష్వక్సేనుడు, గరుత్మంతుడితోపాటు మహాసుదర్శన చక్రాన్ని పవళింపజేసి, చుట్టూ ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆవాహనం చేసి, మంత్రాలతో దీపారాధన గావించారు. శిలామూర్తులను విశేష ద్రవ్యాలతో అర్చించి, నీటిలో వేంచేపు చేశారు. జలాల స్పర్శ, స్మరణ, దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యప్రదం అని అంగీరస మహర్షి తెలిపినట్లు ప్రధానార్చకులు పేర్కొన్నారు. భక్తకోటిని అనుగ్రహించుటకు శిలామూర్తులకు జలాధివాసం మహోత్సవంతో దివ్యత్వం ఏర్పడుతుందన్నారు. జలాదివాసంలో వేంచేసిన మూర్తులలోని సర్వవిధ దోషాలు తొలగి పరమ పవిత్రత చేకూరుతుందన్నారు. అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో నిత్య లఘు పూర్ణాహుతిని చేపట్టారు.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఉదయం 9గంటలకు బాలాలయంలోని యాగశాలలో అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు శాంతి పాఠం, ద్వార తోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, మూలమంత్ర హవనం చేపట్టారు. యాగశాలలో తూర్పు దిశలో చతురస్రాకార కుండంతో వాసుదేవ ముఖంగా యాగాన్ని చేపట్టారు. దక్షిణాన ధనుస్సు(అర్ధ చతురస్రం) ఆకారంలోని కుండంలో సంకర్షకుడి సమక్షంలో హోమ పర్వాన్ని కొనసాగించారు. పడమర దిశలోని వృత్తాకార కుండంలో ప్రద్యుమ్నుడి ఆధిపత్యంలో.. ఉత్తరాన త్రికోణాకారంలో అనిరుద్ధుడు అభిముఖంగా యాగం కొనసాగుతున్నది.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ప్రధానాలయంలో మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు కొనసాగుతున్నాయి. లక్ష్మీనృసింహ మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలను 108 మంది రుత్వికులు పఠించారు. వీటితో పాటు దివ్య ప్రబంధ పారాయణం, మహాభారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత, సుదర్శనం, సుందరకాండ, నారాయణ దివ్ర ప్రబంధ పారాయణాలు పఠిస్తూ జపాలను కొనసాగించారు.