జగిత్యాల, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల పరిషారంలో నిర్లక్ష్యం, అవినీతి, విధుల్లో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ఆయన మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి పా ల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కలెక్టర్లతోపాటు, ఇతర అన్నిశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో చేపట్టిన సమీక్ష మొదటి సమావేశమని, ఇకపై అన్ని జిల్లాల్లోనూ అధికారులతో సమీక్ష సమావేశా లు నిర్వహిస్తామని తెలిపారు.
విధుల్లో నిర్ల క్ష్యం వహించిన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులకు షోకాజ్ నో టీసులు జారీ చేయాలని సూచించారు. అధికారులు వారికి కేటాయించిన హెడ్క్వార్టర్లలో నివాసం ఉంటున్నారా? లేదా? అనే అంశం పై నివేదిక తెప్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేసినట్టు మహిళ ఫిర్యాదు చేసిన ఘటనపై తహసీల్దార్‌ను వివరణ కోరాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల మొదటి దశలోని ఎల్-3 సమస్యలను ఈ నెలాఖరులోగా పరిషరించాలని ఆదేశించారు. 22ఏ, అసైన్డ్ భూముల కేసులను పారదర్శకంగా, వేగంగా పరిషరించాలని, అవసరమైతే 24 గంటలూ పనిచేయాలని చెప్పారు.