న్యూఢిల్లీ : దేశంలోని కార్పొరేట్ దవాఖాల పరిశ్రమ భారీ విస్తరణ దిశగా ముందుకు దూసుకుపోతున్నది. ఇప్పటికే ఉన్న ప్రముఖ దవాఖాన చైన్లు పడకల సంఖ్యను మరింతగా పెంచుతుండగా, కొత్తగా మరికొన్ని సంస్థలు వైద్యరంగంలోకి భారీ పెట్టుబడులతో కాలుమోపుతున్నాయి. వీటికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు భారీ పెట్టుబడులతో అండగా నిలుస్తుండగా, విస్తృత బీమా కవరేజీ మరింతమందిని కార్పొరేట్ వైద్యానికి చేరువ చేస్తున్నది. ఇది దవాఖానల నిర్వాహకులకు విస్తరణపై నమ్మకాన్ని కల్గిస్తున్నది. 2022 ఆర్థిక సంవత్సరం నుంచి దవాఖానలు ప్రైవేట్ ఈక్విటీ, పబ్లిక్ మార్కెట్ల ద్వారా రూ.55 వేల కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ఆకర్షించాయని ‘క్రిసిల్ రేటింగ్స్’ అంచనా వేసింది.
ఇందులో 2025-26లోనే దాదాపు రూ.25 వేల కోట్లు ఉండటం విశేషం. దేశంలోని ప్రముఖ దవాఖాన చైన్లు 2030 నాటికి 38 వేల కంటే అధిక పడకలను విస్తరించేందుకు రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయని అంచనా. ఇదిలా ఉండగా ప్రైవేట్ దవాఖానల వేగవంతమైన విస్తరణకు ఆరోగ్య బీమా కవరేజీ పెరుగుదల తోడ్పడుతున్నది. ప్రస్తుతం 55 కోట్లకుపైగా భారతీయులకు ఆరోగ్య బీమా ఉంది. కాగా బీమా కవరేజ్ పెరిగినప్పటికీ చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. మిల్లిమన్ ఇండియా -2025 నివేదిక ప్రకారం వైద్య ద్రవ్యోల్బణం 12 నుంచి 14 శాతంగా ఉంది. 2018లో రూ. లక్ష నుంచి లక్షా 50వేల వరకూ ఖర్చయ్యే చికిత్సకు ఇప్పుడు రూ. రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకూ అవుతున్నది. ఎఎస్ఎస్వో డేటా ప్రకారం ప్రైవేట్ దవాఖానల్లో సగటు ఇన్ పేషెంట్ ఖర్చు 2010లో రూ.12,546 ఉండగా, 2023 నాటికి 239శాతం పెరిగి రూ.42,600కి చేరింది.