హైదరాబాద్, ఆట ప్రతినిధి: కొత్త ఖేలో ఇండియా పథకం దేశ క్రీడారంగం రూపురేఖలను మార్చే విప్లవాత్మక ప్రాజెక్ట్ అని దిగ్గజ షట్లర్ గుత్తా జ్వాల చెప్పింది. ఇలాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టు ఎప్పుడో రావాల్సిందని అభిప్రాయపడింది. 202631 కాలానికి అమలయ్యే ఈ పథకానికి గతంతో పోలిస్తే 8 రెట్లు అధికంగా రూ.29,054 కోట్లను కేటాయించినట్టు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) రీజినల్ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అథ్లెట్ల సంఖ్యను 30 వేల మందికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జ్వాల ప్రభుత్వ మద్దతుతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని, క్షేత్రస్థాయి నుంచి క్రీడల అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల చిన్నారులను ఆటల వైపు పంపడానికి తల్లిదండ్రులు సురక్షితంగా భావిస్తారని అభిప్రాయపడింది. కాగా, కేంద్ర-రాష్ర్టాల పరస్పర సహకారంతో రూపుదిద్దుకున్న ఈ పథకం కింద తెలంగాణలో ఇప్పటికే 33 ఖేలో ఇండియా కేంద్రాలు, మేడ్చల్-మల్కాజ్‌గిరిలోని స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా వందలాది మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది.