బంజారాహిల్స్ ఆగస్ట్ 21: సొంత మామను తుపాకీతో బెదిరించి ఖరీదైన స్థలానికి సంబంధించి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రో్డ నెంబర్ 10 జహేరానగర్ చౌరస్తా సమీపంలో నివాసముండే ఆర్ ఏ పాల్ (75)కి 3,400 చదరపు గజాల స్థలం ఉంది. దీనిలో సంబంధించి 2022లో నవీన్ గోయల్ అనే బిల్డరుతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు.
ఆ స్థలంలో అప్పటికే 10 షాపులు ఉండడంతో అగ్రిమెంట్ అమలు చేయడం ఆలస్యం అయింది. అదే స్థలంలో పాల్ అల్లుడు ఇమ్రాన్ సైతం ఓ షాపు కలిగి ఉన్నాడు.. మిగిలిన 9 మంది ఖాళీ చేసిగనా ఇమ్రాన్ మాత్రం అక్కడే తిష్ట వేసి సొంతమామ పాల్‌ను బెదిరింపులకు గురి చేస్తున్నాడు.. ఈ నేపద్యంలో ఈ స్థలాన్ని తన స్నేహితులకు డెవలప్మెంట్ ఇవ్వాలి అంటూ గురువారం రాత్రి ఇమ్రాన్ మరో వ్యక్తితో పాల్ ఇంటికి వచ్చి, తనకు అనుకూలంగా అగ్రిమెంట్ చేయాలని ఒత్తిడి చేసి రివాల్వర్‌తో బెదిరించాడు.
టేబుల్ మీద రివాల్వర్ ఉంచి సంతకం చేయకపోతే ప్రాణాలతో మిగలవు అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన పాల్ తెల్ల కాగితాలపై సంతకాలు చేసి ఇచ్చాడు. రూ.5 లక్షలు అడ్వాన్స్ గా అందినట్లు తెల్ల కాగితంలో సంతకం చేయించుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున పాల్ ఖాతాకు రూ.5 లక్షలు ఆర్ టీ జీ ఎస్ చేసారు. ఈ మేరకు బాధితుడు పాల్ శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇమ్రాన్, జునైద్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.