ఆరోగ్యమైన జీవితానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్రకూడా అంతే అవసరం! అయితే, మారుతున్న జీవనశైలి మనిషికి నిద్రను దూరం చేస్తున్నది. ఉద్యోగరీత్యానే కాకుండా.. అర్ధరాత్రి వరకూ టీవీలు చూస్తూ, స్మార్ట్ఫోన్లో మునిగిపోతూ నిద్రా సమయాన్ని వృథా చేసుకుంటున్నారు చాలామంది. ఫలితంగా, లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్ర పోకపోతే.. అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర కొరత వల్ల మెదడు పనితీరు తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా.. ఏకాగ్రత, ఆలోచన శక్తి, జ్ఞాపకశక్తి నెమ్మదిస్తాయనీ, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో.. తీవ్రమైన తలనొప్పి వేధిస్తుందని చెబుతున్నారు. ఇక నిద్ర తగ్గినప్పుడు.. ఆకలిని నియంత్రించే హార్మోన్లు అదుపు తప్పుతాయట. దాంతో వారు అతిగా తిని.. ఊబకాయం బారినపడే అవకాశం ఉంటుందట. కంటి నిండా నిద్రలేకపోతే.. గుండె జబ్బులు, రక్తపోటు ప్రమాదం పెరుగుతుందట. నిద్రలేమి.. రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుందనీ, దాంతో తరచుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందనీ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, నిద్ర విషయంలో నిర్లక్ష్యం కూడదనీ, రాత్రిపూట కనీసం ఎనిమిది గంటలైనా కంటినిండా నిద్రపోవాలనీ సూచిస్తున్నారు.