MK Stalin : నీట్ పరీక్ష (NEET Exam) పేపర్ లీక్ (Paper Leak) కావడం, ఆ కారణంగా కేంద్రం పరీక్షను రద్దు చేయడంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి (Tamil Nadu Ex CM), డీఎంకే పార్టీ అధ్యక్షుడు (DMK chief) ఎంకే స్టాలిన్ (MK Stalin) మండిపడ్డారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) తో లక్షలాది మంది విద్యార్థులు మానసిక వేదనకు గురయ్యారని అన్నారు. నీట్ పరీక్ష ప్రక్రియలో ప్రతి దశలోనూ మోసాలు ఉన్నట్లు కనబడుతోందని, అసలు నీట్ పరీక్షా విధానమే ఒక పెద్ద కుంభకోణం (Big Scam) అని వ్యాఖ్యానించారు.
ఏటా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నీట్ పరీక్ష విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. పన్నెండో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంబీబీఎస్ సీట్లు కేటాయించే పాత విధానాన్ని తిరిగి అమలు చేయాలని సూచించారు. తమిళనాట కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తన దృఢ వైఖరిని స్పష్టం చేయాలనే డిమాండ్ వినిపించారు. ఈ పరీక్షా విధానం నుంచి మినహాయింపు కోరుతూ గతంలో తమ ప్రభుత్వం చేసిన న్యాయపరమైన ప్రయత్నాలను విజయ్ సర్కారు ముందుకు తీసుకెళ్లాలని స్టాలిన్ సూచించారు.