హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను అక్టోబర్ నాటికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఆదేశించింది. ఈ మేరకు పునరుద్ధరణ పనులకు సిద్ధం కావాలని సూచించింది. బరాజ్‌ల పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు, సాంకేతిక సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ ఎన్డీఎస్ఏ టెక్నికల్ మెంబర్ నేతృత్వంలో సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్), సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్, మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) నిపుణులు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లతో కలిపి ఒక టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విధితమే.
ఈ కమిటీ చైర్మన్, ఎన్డీఎస్ఏ టెక్నికల్ మెంబర్ సమీర్‌కుమార్ శుక్లా నేతృత్వంలో ఢిల్లీలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి ఇరిగేషన్ శాఖ జాయింట్ సెక్రటరీ(టెక్నికల్) కే శ్రీనివాస్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) సీఈ ఎంఎస్ఎన్ శ్రీనివాస్, టన్నెల్ ఎక్స్పర్ట్ పరీక్షిత్ మెహ్రాతోపాటు, పలువురు ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా బరాజ్‌ల పునరుద్ధరణకు సంబంధించి ఇప్పటివరకు ఏయే సాంకేతిక పరీక్షలను నిర్వహించింది? వాటి నివేదికలు, ఫలితాలు తదితర అంశాలను కమిటీ చైర్మన్, నిపుణులకు టన్నెల్ ఎక్స్పర్ట్ పరీక్షిత్ మెహ్రా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ భేటీలో బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు సంబంధించి డిజైన్లు, తదితర సాంకేతిక అంశాలపై సమగ్రంగా చర్చించారు. చేపట్టాల్సిన పనులకు సంబంధించి తొలుత ప్రాథమిక డిజైన్లను అక్టోబర్ నాటికి అందజేస్తామని, వాటిని పరిశీలించిన అనంతరం తుది డిజైన్లను అందజేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని కమిటీ చైర్మన్, మెంబర్లకు ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు వివరించారు. దీనిపై కమిటీ చైర్మన్ అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సన్నద్ధం కావాలని, పెండింగ్ సాంకేతిక పరీక్షలు సైతం సకాలంలో పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.